John Wesley : కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో తొలిసారి.. సీపీఎం తెలంగాణ కార్యదర్శిగా దళితుడి నియామకం..
70 ఏళ్లు దాటిన రాష్ట్ర నేతలకు రాష్ట్ర కమిటీ నుంచి ఉద్వాసన కల్పించింది సీపీఎం.

John Wesley : సీపీఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ ఎంపికయ్యారు. సంగారెడ్డిలో జరిగిన సీపీఎం రాష్ట్ర మహాసభలో రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీని ఎన్నుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తమ్మినేని వీరభద్రం స్థానంలో వెస్లీ ఎంపికయ్యారు. 70 ఏళ్లు దాటిన రాష్ట్ర నేతలకు రాష్ట్ర కమిటీ నుంచి ఉద్వాసన కల్పించింది సీపీఎం. జాన్ వెస్లీది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అమరచింత గ్రామం. కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో తొలిసారి ఓ దళితుడిని పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు.
Also Read : హామీలు తప్ప అమలు చేయడం లేదు- కాంగ్రెస్ సర్కార్ పై కేటీఆర్ ఫైర్
భవిష్యత్తులో మరింత ఉధృతమైన పోరాటాలు చేస్తాం..
”తెలంగాణ రాష్ట్రంలో కార్మిక వర్గం, రైతులు, కూలీలు… పెట్టుబడిదారులు, భూస్వాములు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ విధానాలకు దోపిడీకి గురవుతున్నారు. ఆ వర్గ ప్రజలకు న్యాయం జరగడం కోసం సీపీఎం పార్టీ భవిష్యత్తులో మరింత ఉధృతమైన పోరాటాలు చేస్తుంది.
ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించాలని చూస్తున్నాం…
అలాగే తెలంగాణలో సామాజికంగా అణిచివేతకు గురవుతున్న దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలు, మైనార్టీలు.. మహిళల మీద తీవ్రమైన అణిచివేత, అత్యాచారాలు, కుల వివక్ష.. ఇలాంటి దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి. దోపిడీకి గురవుతున్న ప్రజలను సంఘటితం చేస్తూ, సామాజిక అణిచివేతకు గురవుతున్న సామాజిక తరగతులను కూడా కలుపుకుని తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించాలని చూస్తున్నాం.
కాంగ్రెస్ సర్కార్ అనేక వాగ్దానాలు ఇచ్చింది, అమలు మాత్రం శూన్యం..
బీఆర్ఎస్ ప్రభుత్వం పోయాక కాంగ్రెస్ సర్కార్ వచ్చింది. ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని అనేక వాగ్దానాలు ఇచ్చింది. కానీ అమల్లో మాత్రం ఆ చిత్తశుద్ధి కనిపించడం లేదు. రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ, గిట్టుబాటు ధరలు కల్పించే విషయంలో సరైన విధానం లేదు. అలాగే వ్యవసాయ కూలీలకు ఇస్తామన్న ఆర్థిక సాయం ఇవ్వడం లేదు. ఉపాధి కూలీలకు పని కల్పించడంలో కూడా ప్రభుత్వం విఫలం అవుతోంది. ఉద్యోగాల భర్తీ సరిగా జరగడం లేదు.
Also Read : సినిమా షూటింగ్‌లకు ఇది సరైన ప్లేస్- ఎక్స్‌పీరియం పార్క్ మహా అద్భుతం అన్న మెగాస్టార్ చిరంజీవి
పేదలు ఉండేందుకు జాగా కూడా లేదు..
విద్య, వైద్య తెలంగాణలో వ్యాపారంగా మారింది. వాటిని అరికట్టే చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది పేదలు, కార్మికులు కనీస వేతనం లేకుండా ఉన్నారు. ఇల్లు, ఇంటి స్థలం లేక గుడిసెల్లోనే ఉంటున్నారు. వారికి కనీసం ఇప్పటివరకు పట్టాలు ఇవ్వడం కానీ, ఇళ్లు కట్టించి ఇవ్వడం కానీ ప్రభుత్వం చేయలేదు. కనీసం ఉండేందుకు జాగా కూడా లేని స్థితిలో పేదలు ఉన్నారు. అలాంటి వారి సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం.
సంక్షేమ హాస్టల్స్ లో కనీస సౌకర్యాలు మెరుగుపడటం లేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెరగడం లేదు. విద్య, వైద్యం, ఉపాధి కల్పించేలా పోరాటాలు కొనసాగిస్తాం” అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారు.