జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ప్రచారం: అటు అక్క, ఇటు తమ్ముడు.. ఓటర్లు ఆ గట్టునుంటారా? ఈ గట్టునుంటారా?

అప్పుడు జూబ్లీహిల్స్ బస్తీలు ఖైరతాబాద్ సెగ్మెంట్లోనే ఉండేవి. ఆ ఏరియాల్లో పీజేఆర్‌కు మంచి పట్టు ఉండేది. ఇప్పటికీ జూబ్లీహిల్స్‌లో పీజేఆర్‌కు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు.

జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ప్రచారం: అటు అక్క, ఇటు తమ్ముడు.. ఓటర్లు ఆ గట్టునుంటారా? ఈ గట్టునుంటారా?

Updated On : October 14, 2025 / 9:33 PM IST

Jubilee Hills Bypoll 2025: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత పోటీ చేస్తుండగా.. వారిద్దరికి మద్దతుగా ఆ అక్కా తమ్ముడు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. వాళ్లే ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, దివంగత నేత పీ జనార్ధన్‌రెడ్డి కూతురు విజయారెడ్డి, తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి.

ప్రస్తుతం విజయారెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీలో ఉండగా.. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో విష్ణువర్ధన్ రెడ్డి కొనసాగుతున్నారు. దీంతో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అక్క కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమిస్తుండగా.. తమ్ముడేమో కాంగ్రెస్జెండాను ఎగరనీయనంటూ ప్రతిన పూనుతున్నారు. ఇలా వీళ్లిద్దరూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అటు విజయారెడ్డి, ఇటు విష్ణువర్ధన్రెడ్డి ఇద్దరు పీజేఆర్ వారసులు. గతంలో ఇద్దరు కాంగ్రెస్‌లో పనిచేశారు. (Jubilee Hills Bypoll 2025)

జూబ్లీహిల్స్ నుంచి విష్ణువర్ధన్‌రెడ్డి, ఖైరతాబాద్‌లో విజయారెడ్డి పాలిటిక్స్ చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత విజయారెడ్డి బీఆర్ఎస్‌లో చేరి కార్పొరేటర్‌గా కూడా ఎన్నికయ్యారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల ముందు విజయారెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లగా..విష్ణువర్ధన్‌రెడ్డి కారెక్కేశారు. అయితే పీజేఆర్ గతంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా పనిచేశారు.

అప్పట్లో ఆ ఏరియాల్లో పీజేఆర్‌కు మంచి పట్టు

అప్పుడు జూబ్లీహిల్స్ బస్తీలు ఖైరతాబాద్ సెగ్మెంట్లోనే ఉండేవి. ఆ ఏరియాల్లో పీజేఆర్‌కు మంచి పట్టు ఉండేది. ఇప్పటికీ జూబ్లీహిల్స్‌లో పీజేఆర్‌కు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఈ ఈక్వేషన్‌లో అటు కాంగ్రెస్ విజయారెడ్డి ద్వారా..ఇటు బీఆర్ఎస్ విష్ణువర్ధన్‌రెడ్డితో పీజేఆర్ అభిమానులను, బస్తీ వాసులకు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

ఇదే సమయంలో పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్నారు. మాగంటి గోపీనాథ్‌ మరణంతో వచ్చిన ఈ ఉప ఎన్నికను పర్సనల్‌గా తీసుకున్న విష్ణువర్ధన్రెడ్డి..పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించుకునేందుకు శాయశక్తులా పనిచేస్తున్నారు. ఆమె వెంటే ఉంటూ సొంత సోదరిలా ఆమె గెలుపే తన గెలుపుగా భావిస్తూ జూబ్లీహిల్స్ గల్లీ గల్లీ తిరుగుతున్నారు.

Also Read: శ్రీవారి పరకామణి పాపం ఎవరి మెడకు చుట్టుకోనుంది? వడ్డీకాసుల వాడి కాసులు కొట్టేసిందెవరు? ఫైల్స్ స్వాధీనం

తాను బతికి ఉన్నంతవరకు ఇక్కడ కాంగ్రెస్ జెండాను ఎగురనివ్వనంటూ భీషణ శపథం కూడా చేశారు విష్ణు. జూబ్లీహిల్స్‌లో కచ్చితంగా గులాబీ జెండా ఎగురుతుందని, ఆ బాధ్యత తానే తీసుకుంటున్నానని విష్ణువర్ధన్ రెడ్డి గంటాపథంగా చెబుతున్నారు. ఇలా జూబ్లీహిల్స్‌లో అటు అక్కా, ఇటు తమ్ముడు.. ఒకరు కాంగ్రెస్ కోసం, మరొకరు బీఆర్ఎస్ కోసం తీవ్రంగా శ్రమించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అభ్యర్థులు కాదు.

కానీ ఒకరు మాజీ ఎమ్మెల్యే అయితే, మరొకరు జీహెచ్ఎంసీ కార్పొరేటర్. విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యేగా రెండు సార్లు మాగంటి గోపీనాథ్‌పై పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఇప్పుడు అదే మాగంటి కుటుంబం కోసం ఆయన సతీమణి సునీత తరఫున బీఆర్ఎస్‌ను గెలిపించుకునేందుకు పనిచేస్తుండటం ఇంట్రెస్టింగ్‌గా మారింది. జూబ్లిహిల్స్ నుంచి మళ్ళీ తాను ఎమ్మెల్యే కావాలని బలంగా కోరుకోవాల్సిన విష్ణువర్ధన్ రెడ్డి..ఇప్పుడు మాగంటి సునీత కోసం పనిచేయాల్సి రావడం ఆసక్తికరంగా మారింది.

ఇక ప్రస్తుతం కార్పొరేటర్‌గా ఉన్న విజయారెడ్డి కూడా ఎప్పటినుంచో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ టికెట్‌ ఆశిస్తున్న విజయారెడ్డికి అవకాశం మాత్రం రావడం లేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ గెలుపు కోసం సీరియస్‌గా పనిచేస్తూ..అధిష్టానం దృష్టిలో పడేందుకు..పార్టీ రాష్ట్ర పెద్దలను మన్ననలను పొందేందుకు విజయారెడ్డి ప్రయత్నం చేస్తున్నారట.

జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే వచ్చే ఎన్నికల్లోనైనా తనకు ఖైరతాబాద్ టికెట్ దక్కడానికి ప్లస్ పాయింట్‌గా మారుతుందని లెక్కలు వేసుకుంటున్నారట విజయా రెడ్డి. ఫ్యూచర్ పొలిటికల్ ప్లాన్‌లో భాగంగా అక్కా కాంగ్రెస్ గెలుపుకోసం..తమ్ముడు బీఆర్ఎస్ విజయం కోసం శ్రమిస్తుండటం ఇంట్రెస్టింగ్‌గా మారింది.