శ్రీవారి పరకామణి పాపం ఎవరి మెడకు చుట్టుకోనుంది? వడ్డీకాసుల వాడి కాసులు కొట్టేసిందెవరు? ఫైల్స్ స్వాధీనం

పరకామణి కేసుకు సంబంధించి టీటీడీ పాలక మండలి తీర్మానాలు.. లోక్ అదాలత్‌లో రాజీ చేసిన ఫైల్స్ అన్ని పరిశీలించారు సీఐడీ అధికారులు.

శ్రీవారి పరకామణి పాపం ఎవరి మెడకు చుట్టుకోనుంది? వడ్డీకాసుల వాడి కాసులు కొట్టేసిందెవరు? ఫైల్స్ స్వాధీనం

TTD

Updated On : October 14, 2025 / 9:05 PM IST

TTD: దేవ దేవుడి సన్నిధి. ఏడు కొండల వాడి ఖజానా. శేషాద్రివాసుడి హుండీ లెక్కించే అవకాశమే అదృష్టం. కానీ అందులో కూడా చేతివాటం ప్రదర్శించి పాపం అంటగట్టుకున్నారు కొందరు. తిరుమల తిరుపతి దేవస్థానం పరికామణి విభాగంలో జరిగిన దొంగతనం కేసు మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. అప్పటి ఉద్యోగి రవికుమార్‌ 920 డాలర్లు కొట్టేశారని టీటీడీ విజిలెన్స్‌ అధికారులు ఏప్రిల్‌ 2023లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో లోక్‌ అదాలత్‌ ముందు రవికుమార్‌తో రాజీ కుదిరింది.

ఈ రాజీ నిర్ణయం చట్టపరంగా ఎంతవరకు కరెక్ట్‌ అన్న వివాదం మొదలైంది. ఈ చోరీపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగలేదని..ఓ జర్నలిస్టు హైకోర్టులో పిటిషన్‌ వేయడంతో మళ్లీ చర్చ స్టార్ట్ అయింది. పరకామణి చోరీ కేసుకు సంబంధించి..ఖజానా రికార్డులు, రాజీ ఒప్పంద పత్రాలు సీజ్‌ చేయాలని హైకోర్టు సూచించింది. అయితే పోలీస్‌ అధికారులు కోర్టు ఆదేశాలను పాటించలేదని లేటెస్ట్‌గా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకంగా పోలీస్ స్టేషన్లనే మూసివేయండి అంటూ ఘాటుగా స్పందించింది. దీంతో వెంటనే సీఐడీ అధికారులు రంగంలోకి దిగారు. (TTD )

పరకామణి కేసుకు సంబంధించి టీటీడీ పాలక మండలి తీర్మానాలు.. లోక్ అదాలత్‌లో రాజీ చేసిన ఫైల్స్ అన్ని పరిశీలించారు సీఐడీ అధికారులు. ఆ డాక్యుమెంట్స్ అన్నీ సీజ్ చేశారు. సీసీ పుటేజీను కూడా పరిశీలిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. పరకామణి చోరీ కేసు నమోదైన తిరుమల వన్‌ టౌన్ పీఎస్‌లో రికార్డుల పరిశీలించారు.

Also Read: రాష్ట్రమంతా వేరు.. మునుగోడు వేరంటున్న రాజగోపాల్‌రెడ్డి.. మునుగోడులో మద్యం షాపులకు కొత్త రూల్స్, టైమింగ్స్.. ఏం జరుగుతోంది?

లోక్ అదాలత్‌లో రాజీ తర్వాత..పరకామణి లెక్కింపులో చోరీ చేసిన రవికుమార్..టీటీడీకి రూ.14 కోట్ల విలువైన ఆస్తులను విరాళంగా ఇచ్చినట్లు గుర్తించారు. అయితే రాజీ ద్వారా నిందితుడిపై చర్యలు నిలిపివేయడమే పెద్ద వివాదం అవుతోంది. ఈ విషయంపై ఇప్పటికే టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాశ్‌రెడ్డి ఈ మధ్యే ప్రెస్‌మీట్ పెట్టి మరీ అప్పటి టీటీడీ పెద్దలపై అలిగేషన్స్ చేశారు. స్వామివారి సొమ్మును స్వాహా చేస్తే చర్యలు తీసుకోకుండా..ప్రైవేటుగా సెటిల్‌ చేయడమేంటి..అలా చేయడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారని ప్రశ్నించారు.

శ్రీవారి హుండీని దొంగతనం చేసిన రవికుమార్ అనే వ్యక్తిని కోర్టులో నిందితుడిగా ప్రవేశపెట్టకుండానే..లోక్ అదాలత్‌లో రాజీచేయడం, అతడు చోరీ చేస్తుండగా సీసీ పుటేజీకి చిక్కడం వంటి బలమైన ఆధారాలు ఉన్నా చర్యలు తీసుకోకపోవడంపై కూటమి పెద్దలు డౌట్స్‌ వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రూ.వంద కోట్ల వరకు శ్రీవారి హుండీ నుంచి దోచేశారని, 40 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను బినామీ పేర్లతో రాయించుకున్నారని..భూమన కరుణాకర్‌రెడ్డి టార్గెట్‌గా అలిగేషన్స్ చేస్తున్నారు కూటమి నేతలు.

తిరుమల వేదికగా రాజకీయం

ఆ మధ్య టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి బయటపెట్టిన వీడియోతో తిరుమల వేదికగా రాజకీయం మరోసారి వేడెక్కింది. అయితే తన మీద వచ్చిన ఆరోపణలపై భూమన కరుణాకర్‌రెడ్డి కూడా సీరియస్‌గానే రియాక్ట్ అయ్యారు. తాను టీటీడీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు పరకామణిలో దొంగతనం జరిగినట్లు నిరూపిస్తే తల నరుక్కుంటానని సవాల్ చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే రవికుమార్ శ్రీవారి హుండీ లెక్కింపులో దొంగతనం చేశారని భూమన అంటున్నారు.

రవికుమార్ కుటుంబ సభ్యులు పాప పరిహారంగా తమ ఆస్తులను టీటీడీకి రాసిచ్చారని చెప్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే పరకామణి చోరీ జరిగిందని..రవికుమార్‌ అనే వ్యక్తి వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని కూటమి ఆరోపిస్తోంది. ఒక ఉద్యోగి టీటీడీకి రూ.14కోట్లు రాసిచ్చారంటే..శ్రీవారి ఖజానా నుంచి ఎంత కొట్టేశారో అర్థం చేసుకోవచ్చంటున్నారు.

పైగా రవికుమార్‌ నుంచి అప్పుడు టీటీడీలో కీలకంగా ఉన్న నేతలు ఆస్తులు రాయించుకున్నారని కూడా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు సీఐడీ విచారణతో ఇది ఎవరికి మెడకు చుట్టుకుంటుందోనన్న టెన్షన్ మొదలైంది. ఇప్పటికే రోజుకో ఇష్యూ ఏపీ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. ఇప్పుడు పరకామణి ఎపిసోడ్‌ ఎటు దారితీయబోతోంతో..ఎవరెవరు బుక్ అవుతారో వేచి చూడాలి మరి.