రాష్ట్రమంతా వేరు.. మునుగోడు వేరంటున్న రాజగోపాల్‌రెడ్డి.. మద్యం షాపులకు కొత్త రూల్స్, టైమింగ్స్.. ఏం జరుగుతోంది?

పొద్దంతా వైన్స్ షాపులు బంద్ ఉంటే బెల్ట్ షాపుల డిమాండ్ పెరిగే ప్రమాదం కూడా ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్రమంతా వేరు.. మునుగోడు వేరంటున్న రాజగోపాల్‌రెడ్డి.. మద్యం షాపులకు కొత్త రూల్స్, టైమింగ్స్.. ఏం జరుగుతోంది?

komatireddy rajgopal reddy

Updated On : October 14, 2025 / 9:54 PM IST

Munugodu: ఆయన అస్సలు తగ్గడం లేదు. వేదిక ఏదైనా, సందర్భం మరేదైనా..ప్రతి నిమిషం తన చుట్టే చర్చ జరిగేలా రాజకీయం తిప్పుతున్నారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా ఇచ్చిపడేస్తున్నారు. రీజినల్‌ రింగ్‌ రోడ్‌ రైతులకు న్యాయం జరగకపోతే ప్రభుత్వాన్ని మార్చేద్దామంటూ స్టేట్మెంట్ ఇచ్చి పెద్ద చర్చకు దారి తీశారు. ఈ సమయంలో పలుసార్లు సొంత పార్టీని, సీఎంను ఇరకాటంలో పెట్టేలా మాట్లాడిన రాజగోపాల్‌రెడ్డిపై యాక్షన్‌కు డిమాండ్లు వెల్లువెత్తాయి.

కానీ పీసీసీ క్రమశిక్షణ కమిటీ కనీసం ఆయనకు నోటీసులు కాదు కదా..ఫోన్ చేసి వివరణ అడిగే సాహసం కూడా చేయలేదు. ఇప్పుడు మరోసారి ఏకంగా ప్రభుత్వం పెట్టిన రూల్స్ జాన్తానై అంటున్నారు రాజగోపాల్‌రెడ్డి. తెలంగాణలో వైన్ షాపులు ఉదయం 10.30 నుంచి రాత్రి పది గంటల వరకు ఓపెన్ చేసి ఉంటాయి. పైగా వైన్ షాపుల పక్కన పర్మిట్ రూమ్స్ కూడా నడుస్తాయి. కానీ ఇవన్నీ మునుగోడులో నడవవు అంటున్నారు రాజగోపాల్‌రెడ్డి. ఎక్సైజ్ శాఖ నిబంధనలు ఎలా ఉన్నా..తన నియోజకవర్గంలో మాత్రం తానేది చెప్తే అదే రూల్ అంటున్నారు ఎమ్మెల్యే రాజన్న.

తాను చెప్పిన కండీషన్స్‌కు ఓకే అయితే టెండర్లలో పాల్గొనాలని లేకపోతే ఇబ్బందిపడుతారంటూ హుకుం జారీ చేసేశారు. స్థానికులు మాత్రమే వైన్ షాపులకు టెండర్స్ వేయాలని కండీషన్ పెట్టారు. పైగా ఏ మండలం వారు ఆ మండలంలో మాత్రమే టెండర్లు వేయాలంటున్నారు రాజగోపాల్ రెడ్డి. స్థానికులు మాత్రమే టెండర్లు వేస్తే ఆ తర్వాత తాను చెప్పినట్లుగానే వింటారని..అలా అయితేనే బెల్ట్ షాపులను పూర్తిగా నియంత్రించొచ్చని రాజగోపాల్ రెడ్డి ప్లాన్‌గా చెబుతున్నారు.

ఊరికి దూరంగా వైన్స్ ఏర్పాటు చేసుకోవాలి..

ఇక డ్రాలో షాపును దక్కించుకున్నవారు ఊరికి దూరంగా వైన్స్ ఏర్పాటు చేయాలని, ఊరి మధ్యలో వైన్స్ షాపుపెట్టడానికి వీలు లేదంటున్నారు రాజగోపాల్‌రెడి. బెల్ట్ షాపులకు మద్యం అమ్మొద్దని కూడా రూల్ పెట్టారు. వైన్స్ టైమింగ్స్ కూడా ఎమ్మెల్యేనే ఫిక్స్ చేశారు. ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం ఉదయం పదిన్నర నుంచి రాత్రి పది గంటల వరకు మద్యం దుకాణం తెరవచ్చు.

కానీ మునుగోడులో మాత్రం అన్ని వైన్ షాపులను సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మాత్రమే తెరవాలంటున్నారు ఎమ్మెల్యే. అందుకు ఓకే అయితేనే టెండర్ వేయాలని చెబుతున్నారు. ఇక వైన్‌షాపులకు అనుబంధంగా పర్మిట్ రూములు ఏర్పాటు చేయొద్దని.. వ్యాపారుల సిండికేట్ అయితే ఊరుకునేది లేదని అంటున్నారు రాజగోపాల్ రెడ్డి. పైగా సొంత పార్టీ నేతలు ఎవరూ మద్యం టెండర్లలో పాల్గొనవద్దని హెచ్చరించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 26 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఒక్కొక్క షాపు నుంచి రెండు సంవత్సరాలు కలిపి ప్రభుత్వానికి లైసెన్స్‌ ఫీజు కింద ఒక కోటి 10 లక్షలు చెల్లిస్తారు. అలా 28 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. ఇక టెండలు దాఖలు చేసే సమయంలో దరఖాస్తు ఫీజు కింద దాదాపు నాలుగు కోట్లకు పైగా అదనపు ఆదాయం ఉంటుందన్నది ఓ లెక్క. అయితే రాజగోపాల్ రెడ్డి ప్రకటించిన రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఖాజానాకు భారీగా గండిపడుతుందన్న ఆందోళన ఎక్సైజ్ అధికారుల్లో నెలకొంది.

Also Read: మద్యం మరకలు.. అటుఇటు తిరిగి వైసీపీకే అంటుతున్నాయా? నెక్స్ట్‌ ఏంటంటే?

ఓ వైపు రాష్ట్ర ఖజానా నింపేందుకు రేవంత్ సర్కార్ పడరాని పాట్లు పడుతుంటే..రాజగోపాల్ రెడ్డి పెట్టిన రూల్స్‌తో ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకున్నారట. మరోవైపు ఇప్పటికే వైన్‌షాపులకు టెండర్లు దాఖలు చేసిన స్థానికేతరులు రాజగోపాల్ రెడ్డి కొత్త రూల్స్‌తో ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతున్నారట. పైగా తన నియోజకవర్గంలో తానే రాజు, తానే మంత్రి అంటూ నయా రూల్స్ పాస్ చేస్తున్న రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎలా స్పందించాలో తెలియక అయోమయంలో పడ్డారట ఎక్సైజ్ అధికారులు. ఈ వ్యవహారం తమకెందుకు అని ప్రభుత్వ పెద్దల వైపే చూస్తున్నారట అధికారులు.

అయితే బెల్ట్ షాపులను కంట్రోల్ చేయాలని..ఉదయం నుంచే తాగకుండా అడ్డుకోవచ్చనేది రాజగోపాల్‌రెడ్డి ఆలోచన. వాస్తవానికి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో విచ్చలవిడి మద్యం అమ్మకాల మీద, బెల్టు షాపుల మీద ఉక్కుపాదం మోపుతున్నారు రాజగోపాల్ రెడ్డి. ఉదయం 10 గంటలకే పర్మిట్ రూమ్‌లలో మద్యం సేవిస్తున్నవారికి పలుసార్లు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. ఉదయం నుంచే తాగడం వల్ల కుటుంబం చిన్నాభిన్నం అవుతుందని, ఆరోగ్యంపైనా ప్రభావం పడే అవకాశం ఉందని మద్యం ప్రియులకు చెప్పుకుంటూ వచ్చారు.

గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వహణపై అఖిలపక్ష నేతలతో సమావేశాలు నిర్వహించారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే ఊరుకోవద్దని..అలా ఎవరైనా చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ నజరానాలు కూడా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే పెట్టిన కొత్త రూల్స్‌తో వైన్స్ టెండర్లలో పాల్గొనే వారికి ఆందోళన కలిగిస్తుంది. రాజగోపాల్ రెడ్డి రూల్స్‌కు భయపడి టెండర్లు దాఖలు చేయకపోతే ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరుగుతుందని అధికారులు వాపోతున్నారు.

పొద్దంతా వైన్స్ షాపులు బంద్ ఉంటే బెల్ట్ షాపుల డిమాండ్ పెరిగే ప్రమాదం కూడా ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి పెడుతున్న కండీషన్స్‌ను కొందరు సమర్ధిస్తుంటే..మరికొందరు మాత్రం ప్రాక్టికల్‌గా పాజిబుల్ కాదంటున్నారు. ఇలాంటి రూల్స్ ఒక్క నియోజకవర్గంలో అనుమతిస్తే ఇతర ప్రాంతాల్లో కూడా సమస్య వస్తుందని పలువురు అధికారులు చెబుతున్నారు. రాజగోపాల్ రెడ్డి రూల్స్‌తో మద్యం ప్రియులు నియోజకవర్గ సరిహద్దుల్లో ఉండే దుకాణాలకు క్యూ కడతారని పలువురు టెండర్ దారులు అంటున్నారు. దీంతో మునుగోడు ఎమ్మెల్యే రూల్స్‌పై ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.