Fake liquor case: మద్యం మరకలు.. అటుఇటు తిరిగి వైసీపీకే అంటుతున్నాయా? నెక్స్ట్‌ ఏంటంటే?

ఒక వైపు వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న క్రమంలోనే సిట్ విచారణకు ఆదేశాలు వచ్చాయి. జనార్ధన్‌రావు లిక్కర్‌ లింకులను బయటపెట్టడంతో..వైసీపీ డిఫెన్స్‌లో పడ్డట్లు అయింది.

Fake liquor case: మద్యం మరకలు.. అటుఇటు తిరిగి వైసీపీకే అంటుతున్నాయా? నెక్స్ట్‌ ఏంటంటే?

Jogi Ramesh - Janardan

Updated On : October 14, 2025 / 8:44 PM IST

Fake liquor case: మందుబాబులకు లిక్కర్ ఎంత కిక్కిస్తుందో లేదో తెలియదు కానీ ఏపీ పాలిటిక్స్‌ను ఎప్పుడూ రంజు మీద ఉంచుతోంది లిక్కర్‌ ఇష్యూ. అప్పటి మద్యం స్కామ్ కేసు..ఇప్పటి నకిలీ లిక్కర్ ఇష్యూ చుట్టే తిరుగుతున్నాయ్ ఏపీ రాజకీయాలు. మద్యం స్కామ్‌ కేసుతో పీక్ లెవల్‌ ప్రెజర్‌ను ఫేస్‌ చేసిన వైసీపీ..నకిలీ మద్యం కేసును బ్రహ్మాస్త్రంగా వాడుకునే స్కెచ్‌ వేసింది. అంతో ఇంతో కూటమిని బద్నాం కూడా చేసింది.

తంబళ్లపల్లిలో టీడీపీ నేత జయచంద్రారెడ్డి అరెస్ట్‌తో అధికార కూటమి అడ్డంగా బుక్కైందని దుమ్మెత్తిపోసింది. అయితే లిక్కర్ మరకలు అంటుకుంటే ఎంత డ్యామేజ్ చేస్తాయో తెలిసిన సీఎం చంద్రబాబు వెంటనే అలర్ట్ అయ్యారు. నకిలీ లిక్కర్‌ను ఐడెంటిఫై చేసేందుకు స్పెషల్ యాప్ తేవడమే కాదు..మద్యం కేసుపై ఏకంగా సిట్‌ దర్యాప్తునకు ఆదేశించారు. అలా ప్రభుత్వం ప్రకటన చేసిందో లేదో..కొన్ని గంటల గ్యాప్‌లోనే నకిలీ మద్యం కేసు నిందితుడు జనార్ధన్‌రావు సంచలన వ్యాఖ్యలు చేసి..మద్యం ఇష్యూను కొత్త టర్న్ తీసుకునేలా చేశాడు.

అంతా ఆయన వల్లే అంటూ మాజీమంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ చెప్తేనే..తాను నకిలీ మద్యం తయారు చేశానంటూ చెప్పారు జనార్ధన్‌రావు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే తాము నకిలీ మద్యం దందా ఆపేశామని అయితే తిరిగి మొదలెట్టాలని చెప్పిందే జోగి రమేష్ అంటూ జనార్ధన్‌రావు సంచలన విషయాలనే బయటపెట్టారు.

కామెంట్స్‌తో కలకలం రేపిన నిందితుడు

టీడీపీ కూటమి ప్రభుత్వానికి బ్యాడ్‌ నేమ్ తెచ్చేందుకే తనతో నకిలీ లిక్కర్ తయారు చేయించారన్న జనార్ధన్‌రావు వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో జోగి రమేష్ తనకు ఫోన్ చేసి నకిలీ మద్యం తయారు చేయాలని చెప్పారని..ఇబ్రహీంపట్నంలో కాకుండా తంబళ్లపల్లిలో నకిలీ తయారీ చేయడం వెనుక వైసీపీ వ్యూహాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. తంబళ్లపల్లి అంటే చిత్తూరు జిల్లా, సీఎం చంద్రబాబు సొంత జిల్లా. అలా సీఎం ఇలాకాలోనే అక్రమ దందా నడుస్తుందని బురద జల్లడానికే ఇలా ప్లాన్‌ చేసి నడిపించారన్నది జనార్ధన్ రావు చెప్పిన మాట.

అంతేకాదు జోగి రమేష్, జనార్ధన్‌రావుతో వాట్సప్ చాట్ చేసినట్లు ఓ స్క్రీన్ షాట్ సర్క్యులేట్ అవుతోంది. అయితే లిక్కర్ కేసులో చంద్రబాబు డైరెక్షన్‌లో తనను ఇరికించారని..వాట్సప్ చాట్..జనార్ధన్‌రావు వీడియో అంతా కట్టు కథ అంటున్నారు జోగి రమేష్. చంద్రబాబు, లోకేశ్ తిరుమలకు కానీ, విజయవాడ దుర్గమ్మ టెంపుల్‌కు వచ్చి కానీ..తాను తప్పు చేసినట్లు చెప్తే దేనికైనా సిద్ధమంటూ సవాల్‌ చేస్తూ..నకిలీ మద్యం వ్యవహారంతో తనకేం సంబంధం లేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు జోగిరమేష్.

అయితే పథకం ప్రకారమే జోగిరమేష్‌ ఆఫ్రికాలోని తన ఫ్రెండ్ దగ్గరకు తనను పంపించారని అంటున్నారు జనార్ధన్‌రావు. పైగా తన మనుషుల ద్వారా నకిలీ మద్యం గురించి ఎక్సైజ్ అధికారులకు తెలిసేలా చేసి మరీ దాడులు చేయించారని..అలా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చారని జనార్ధన్ రావు చెబుతున్నారు. అటు సిట్‌..ఇటు జనార్ధన్‌రావు అలిగేషన్స్‌..జోగి రమేష్‌ రియాక్షన్‌తో..నకిలీ మద్యం కేసు బిగ్ టర్న్ తీసుకుంది.

బంగారం కొనుగోళ్లు తగ్గాయని లబోదిబోమంటున్న వ్యాపారులు.. ఎందుకంటే? ఇప్పుడు కొంటే మీ పరిస్థితి..

టీడీపీ కూటమి మీద విమర్శలు చేస్తూ ఏకంగా సీబీఐ విచారణను డిమాండ్ చేస్తున్న ఫ్యాన్‌ పార్టీకి జనార్ధన్‌రావు బయటపెట్టిన వివరాలు షాకింగ్‌గా మారాయి. అయితే తంబళ్లపల్లి నకిలీ మద్యం కేసులో ఉన్నా జయచంద్రారెడ్డి టీడీపీ నేత అయినప్పటికీ..ఆయనకు వైసీపీ సీనియర్ లీడర్ మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సన్నిహిత సంబధాలున్నాయని..గతంలో పెద్దిరెడ్డి దగ్గర సబ్‌ కాంట్రాక్టులు చేసేవాడని ఆరోపణలు ఉన్నాయి.

నకిలీ మద్యం కేసు బయటికి వచ్చినప్పుడు కూడా జయచంద్రారెడ్డి లింకులను బయటికి తీస్తే వైసీపీ లీడర్లు బుక్కవడం ఖాయమని టీడీపీ భావించింది. ఈ క్రమంలోనే సిట్‌ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కానీ ప్రధాన నిందితుడు జనార్ధన్‌రావే ఓ వీడియోను రిలీజ్‌ చేస్తూ జోగి రమేష్‌ ప్లాన్‌ను వివరించడం హాట్‌ టాపిక్ అవుతోంది. లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఇరికిపోయింది కాబట్టి..నకిలీ మద్యంలో తమను బద్నాం చేయాలని వేసిన ప్లాన్‌ బూమరాంగ్ అయిందంటున్నారు టీడీపీ నేతలు.

ఒక వైపు వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న క్రమంలోనే సిట్ విచారణకు ఆదేశాలు వచ్చాయి. జనార్ధన్‌రావు లిక్కర్‌ లింకులను బయటపెట్టడంతో..వైసీపీ డిఫెన్స్‌లో పడ్డట్లు అయింది. సిట్ విచారణలో ఏం తేలుతుందో..ఈ కేసు విషయంలో కోర్టుల్లో ఏం తేలుతుందోనన్నది టైమ్ టేకింగ్‌ మ్యాటర్. అంతలోపు మాత్రం పోటాపోటీ ఆరోపణలు..వివరణలతో ప్రజా కోర్టులో టీడీపీ, వైసీపీ పీక్‌ లెవల్‌ బ్లేమ్‌ గేమ్‌ ఆడుతున్నాయి. పబ్లిక్‌లో మైలేజ్‌ పొందేందుకే ఆడుతున్న ఈ ఆటలో ఎవరు పైచేయి సాధిస్తారనేదే ఇంట్రెస్టింగ్‌ పాయింట్.