మీరు అడగడం విడ్డూరం.. బడుగులకు స్థానం ఇవ్వరా?: పొన్నం, కవిత వాదోపవాదనలు

భారత జాగృతి సంస్థ కోరడమే మీకు అభ్యంతరమా? లేక అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయడమే మీకు అభ్యంతరమా?

మీరు అడగడం విడ్డూరం.. బడుగులకు స్థానం ఇవ్వరా?: పొన్నం, కవిత వాదోపవాదనలు

kalvakuntla kavitha ponnam prabhar exchange of words on jyotirao phule statue

Updated On : January 22, 2024 / 5:32 PM IST

kalvakuntla kavitha: తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి పొన్నం పభాకర్ ట్విటర్ వేదికగా మాటల యుద్ధానికి దిగారు. పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని కవిత కోరడం విడ్డూరంగా ఉందని పొన్నం వ్యాఖ్యానించగా.. రాజకీయ రంగు ఎందుకు పులుముతున్నారని కవిత ప్రశ్నించారు. భారత జాగృతి సంస్థ కోరడమే మీకు అభ్యంతరమా? లేక అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయడమే మీకు అభ్యంతరమా? అని అడిగారు. అసెంబ్లీలో బడుగులకు స్థానం ఇవ్వరా? స్ఫూర్తిదాయక వీరులకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? అని నిలదీశారు.

అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాలేదా?
శాసనసభ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని ఆదివారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదరావును కలిసి కవిత కోరారు. దీనిపై పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ.. పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు పూలే విగ్రహం పెట్టాలని గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. జ్యోతిరావు పూలే తమకు సర్వదా స్మరణీయుడని.. అందుకే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్ అని పెట్టుకుని, ప్రజా పాలన అందిస్తున్నామని చెప్పారు. బీసీలను వంచించిన మీరా బీసీల సంక్షేమం గురించి మాట్లాడేది? మీ నియంతృత్వానికి ఎదురు తిరిగితే ఒక బీసీ మహిళ అని చూడకుండా జగిత్యాల మున్సిపల్ చైర్మన్ ను ఏడిపించింది మీరు కాదా? అని ప్రశ్నించారు. మీ పార్టీ అధ్యక్ష పదవి, కార్యనిర్వహాక అధ్యక్ష పదవి, లీడర్ ఆఫ్ అపొజిషన్ బీసీలకు ఇవ్వగలరా..? అని అడిగారు.

Also Read: తెలంగాణ ప్రభుత్వ సలహాదారులను నియమించిన సీఎం రేవంత్ రెడ్డి

రాజకీయాలకు అతీతంగా మరో పోరాటం
పొన్నం వ్యాఖ్యలపై కవిత స్పందిస్తూ.. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని రాజకీయాలకు అతీతంగా కోరుతుంటే ఎందుకు మీరు రాజకీయ రంగు పులుముతున్నారని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే జాగృతి సంస్థ ద్వారా పోరాటం చేసి అసెంబ్లీ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించామని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహ ఏర్పాటు కోసం రాజకీయాలకు అతీతంగా మరో పోరాటాన్ని సాగిస్తామన్నారు. ఏప్రిల్ 11 నాటికి పూలే విగ్రహాన్ని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని భారత జాగృతి తరపునే కాకుండా యావత్‌ తెలంగాణ ప్రజల తరపున మరోసారి కోరుతున్నామని అన్నారు.

Also Read: ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దు.. నిమిషానికో మాట మార్చే రకం: కోమటిరెడ్డి, జగదీష్ రెడ్డి వాగ్యుద్ధం