BRS Party: బీఆర్ఎస్ పార్టీకి బిగ్‌షాక్.. బీజేపీలోకి మేయర్ సహా పది మంది కార్పొరేటర్లు..!
బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కరీంనగర్ మేయర్ వై. సునీల్ రావుతో సహా పది మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.

Karimnagar mayor Sunil Rao
BRS Party: బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కరీంనగర్ మేయర్ వై. సునీల్ రావుతో సహా పది మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరబోతున్నారు. శనివారం మధ్యాహ్నం 12గంటలకు నగరంలోని ఓ ఫంక్షన్ హాల్ లో జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా వారు బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు తెలిసింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సునీల్ రావు అధిష్టానంకు లేఖను పంపించారు. అయితే, ఆయన పార్టీ మారకుండా బుజ్జగించేందుకు బీఆర్ఎస్ నేతలు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధిష్టానం ఆయన్ను సంప్రదించే ప్రయత్నం చేసినా సునీల్ రావు అందుబాటులోకి రాలేదట.
ఈనెల 28వ తేదీతో కరీంనగర్ కార్పొరేషన్ పాలకవర్గం పదవీకాలం ముగియనుంది. ఈ క్రమంలో మేయర్ సునీల్ రావు బీజేపీలో చేరేందుకు సిద్ధమవ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కరీంనగర్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పన్నెండు, బీజేపీ పన్నెండు, ఎంఐఎం ఏడు, బీఆర్ఎస్ కు 29 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అయితే, ఇవాళ మేయర్ తోపాటు పది మంది కార్పొరేటర్లు బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతున్నా.. ఎంతమంది కార్పొరేటర్లు బీజేపీలో చేరుతారనే విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. పదిమంది కంటే ఎక్కువ మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీలో చేరుతారా.. లేకుంటే ప్రచారం జరుగుతున్న సంఖ్య కంటే తక్కువ మంది కార్పొరేటర్లు బీజేపీలో చేరుతారా అనే అంశం ఆసక్తికరంగా మారింది.
Also Read: Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టమాటాలతో దాడి.. కమలాపూర్ లో తీవ్ర ఉద్రిక్తత
కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారని వార్తలు వచ్చిన వెంటనే మాజీ మంత్రి కమలాకర్ వారితో సమావేశం అయ్యారు. పార్టీ మారకుండా ఉండేలా వారితో చర్చలు జరిపినట్లు తెలిసింది. అయితే, ఇందులో పలువురు బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరే విషయంలో వెనక్కు తగ్గినట్లు సమాచారం. ఇదిలాఉంటే.. సునీల్ రావు లోక్ సభ ఎన్నికల సమయం నుంచి బీఆర్ఎస్ పార్టీతో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. అప్పటి నుంచే ఆయన పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతూ వస్తుంది. కానీ, పార్టీ మార్పును వాయిదా వేస్తూ వచ్చారు.