Karvy : బ్యాంక్ రుణాల ఎగవేత.. కార్వీ ఎండీ పార్థసారధి రెడ్డికి 14 రోజుల రిమాండ్
ఆర్థిక అక్రమాలకు పాల్పడిన కార్వీ ఎండీ పార్థసారథి రెడ్డికి పోలీసులు బేడీలు వేశారు. నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

Karvy
Parthasarathy Reddy remanded : కస్టమర్ల నమ్మకాన్ని వమ్ము చేసి భారీగా ఆర్థిక అక్రమాలకు పాల్పడిన కార్వీ ఎండీ పార్థసారథి రెడ్డికి పోలీసులు బేడీలు వేశారు. కస్టమర్ల షేర్లను వారికి తెలియకుండానే తనఖా పెట్టి బ్యాంకుల నుంచి తీసుకున్న పార్థసారథి రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
పార్ధసారథిపై హైదరాబాద్ సీసీఎస్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. 780 కోట్ల రుణాల ఎగవేత కేసులో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రెండు కేసులు, ఇండస్ ఇండ్ బ్యాంక్ ఒక కేసు పెట్టాయి. కస్టమర్ల షేర్లు తనఖా పెట్టే అధికారం స్టాక్ బ్రోకింగ్‌కు కంపెనీకి లేదు. అయితే కస్టమర్ల షేర్లను తనఖా పెట్టి 780 కోట్లు రుణాలు తీసుకున్న పార్ధసారథిపై.. 720 కోట్లు దుర్వినియోగం చేశాడన్న అభియోగాలున్నాయి.
గతంలో కార్వీపై నిషేధం విధించింది సెబీ. అప్పటికే కార్వీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ద్వారా వేల కోట్లు షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేశారు కస్టమర్లు. నిషేధం విధించడంతో బ్యాంకులు ఇచ్చిన రుణాలను రాబట్టుకోలేకపోయాయి. ఆ తర్వాత కేసులు నమోదయ్యాయి. దీనిపై విచారణ జరిపిన సీసీఎస్ పోలీసులు పార్ధసారథిని అరెస్ట్ చేశారు. ఈ కేసును సీసీఎస్ పోలీసులతో పాటు…ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌లు దర్యాప్తు చేస్తున్నాయి.
కార్వీపై సెబీ నిషేధంతో షేర్లు తనఖా పెట్టుకుని రుణాలు ఇచ్చిన బ్యాంకులు… కార్వీ ఎండీ పార్ధసారథిపై ఫిర్యాదు చేశాయన్నారు హైదరాబాద్ సీసీసీఎస్ డీసీపీ అవినాష్ మొహంతి. కస్టమర్ల షేర్లను కంపెనీ షేర్లుగా చూపడంతో కార్వీ ఎండీపై మూడు కేసులు నమోదయ్యాయని, దీంతో దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు.