తెలంగాణలో డబుల్ డిజిట్ ఎంపీ స్థానాలను గెలవబోతున్నాం: కిషన్ రెడ్డి

లోక్‌స‌భ‌ ఎన్నికల్లో రెండో స్థానం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

తెలంగాణలో డబుల్ డిజిట్ ఎంపీ స్థానాలను గెలవబోతున్నాం: కిషన్ రెడ్డి

Kishan Reddy: లోక్‌స‌భ‌ ఎన్నికల నేపథ్యంలో కావాలనే రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్ మాట్లాడుతోందని, పోలింగ్ ముగిసిన తర్వాత మళ్లీ ఎవరూ దీని గురించి మాట్లాడరని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన 10tvతో మాట్లాడుతూ.. తమపై విమర్శలు చేయడానికి ఏమీ దొరక్క రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తుతున్నారని అన్నారు. ”ప్రధాని మోదీ పైన అవినీతి విమర్శ చేయలేరు. మోదీ కుంభకోణాలు చేశారని విమర్శలు చేయలేరు. మోదీని విమర్శించేందుకు ఎలాంటి అంశాలు లేకనే రిజర్వేషన్లు, హైదరాబాద్ యూటీ అంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నార”ని ధ్వజమెత్తారు.

లోక్‌స‌భ‌ ఎన్నికల్లో రెండో స్థానం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికలు వేరు, పార్లమెంటు ఎన్నికలు వేరని.. శాసనసభ ఎన్నికల్లో స్థానిక అంశాలు ఎజెండా ఉంటాయన్నారు. ”మెజార్టీ ప్రజలు నరేంద్ర మోదీ దేశానికి మూడోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. నరేంద్ర మోదీ మళ్లీ రావాలన్న ఆకాంక్ష ప్రజల్లో ప్రధానంగా ఉంది. ఈ దేశం ముందుకెళ్లాలంటే భద్రత కావాలి. అభివృద్ధి కావాలి.. ఉగ్రవాదం పోవాలి. సంక్షేమ పథకాలు అమలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మా ప్రభుత్వ హయాంలో చేపట్టిన శాంతిభద్రతల రక్షణ, అవినీతి నిర్మూలన ప్రజల ముందు కనబడుతుంది. తెలంగాణలో డబుల్ డిజిట్ ఎంపీ స్థానాలను గెలవబోతున్నాం. సికింద్రాబాద్ లో నేను మంచి మెజార్టీ సాధిస్తాన”ని అన్నారు.

Also Read: మరోసారి మోదీ వస్తే వాళ్లను కోటీశ్వరులను చేస్తారు- కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఫైర్

ఎన్నికల ప్రధాన అధికారికి కిషన్ రెడ్డి లేఖ
ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. 13న జరిగే ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు మౌలిక వసతులు కల్పించాలని లేఖలో కోరారు. ఓటు వేసేందుకు పోలింగ్ స్టేషన్లకు వచ్చే ఓటర్లు క్యూలైన్ లో ఉంటారు కాబట్టి వారికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. వేసవి కాలం కావడంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కిషన్ రెడ్డి కోరారు.

Also Read: ఫిర్ ఎక్ బార్.. మోదీ సర్కార్.. కాంగ్రెస్ సీట్లు వెతుక్కోవడానికి మైక్రోస్కోప్ కావాలి : ప్రధాని మోదీ