ఎలాంటి నిర్ణయం తీసుకోలేక దిక్కులు చూస్తున్న ఆ పార్టీ అధినేత

kodanda ram : మలి దశ తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ ఏర్పాటు చేసి, క్రియాశీలకంగా వ్యవహరించారు ప్రొఫెసర్ కోదండరామ్. ప్రొఫెసర్ కొలువు నుంచి రిటైర్ అయ్యాక పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణ జన సమితి పేరిట పార్టీని ఏర్పాటు చేశారు. గత సాధారణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని కొన్ని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించారు. తానే స్వయంగా పోటీ చేయాలనుకున్నా.. పరిస్థితులు అనుకూలించకపోవడంతో కోదండరామ్ సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. కాంగ్రెస్‌కు మద్దతు పలికారు.
కాంగ్రెస్‌తో స్నేహం ఉందా? లేదా? తేల్చుకోలేకపోతున్నారు
మరోపక్క, కోదండరామ్ ఎలా అయినా చట్టసభల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. కాకపోతే టీజేఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన తాజాగా పొలిటికల్ డెసిషన్ తీసుకోలేక సతమతమవుతున్నారని అంటున్నారు. గత ఎన్నికల మాదిరిగా ఎమ్మెల్సీ, దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌తో స్నేహం ఉందా? లేదా? అనేది తేల్చుకోలేకపోతున్నారని టాక్. ప్రస్తుతానికి వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించారాయన. కానీ, దుబ్బాక ఉప ఎన్నికల విషయంలో రాజకీయ పార్టీగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోతున్నారట.
రాజకీయంగా నిర్ణయాలు తీసుకోవడంలో అయోమయం:
వాస్తవానికి 2018 సాధారణ ఎన్నికల్లో దుబ్బాక స్థానాన్ని పొత్తులో భాగంగా టీజేఎస్‌కు అప్పగించింది కాంగ్రెస్. కానీ, చివరికి బరిలో నిలిచిన అభ్యర్థి కాంగ్రెస్ బీ ఫామ్ మీదనే పోటీ చేశారు. ప్రస్తుతం ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ బరిలో నిలిచినప్పటికీ తమ మద్దతు కోరడం లేదని టీజేఎస్ నాయకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో దుబ్బాకలో కాంగ్రెస్‌కు మద్దతివ్వాలా వద్దా అని ప్రొఫెసర్ గారు తేల్చుకోలేక కన్‌ఫ్యూజన్‌లో పడ్డారని అంటున్నారు. ఉప ఎన్నికల హీట్ పెరిగినా ఒక రాజకీయ పార్టీగా టీజేఎస్ ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడం చర్చనీయాంశం అయ్యింది. ప్రొఫెసర్‌గా రాజనీతిశాస్త్రం బోధించిన కోదండరామ్ సార్.. రాజకీయంగా నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం అయోమయంలో పడుతున్నారని అంటున్నారు.
https://www.youtube.com/watch?v=Xw3T7TY3HeA