సమంత, నాగార్జునపై సురేఖ చేసిన కామెంట్స్ గురించి వివరణ ఇచ్చిన కొండా మురళీ.. కుమార్తె రాజకీయ భవిష్యత్‌పై మంత్రి సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు
కొండా సురేఖ ఫోన్ ట్యాపింగ్ విషయాలను చెప్పింది తప్పా.. సినీ ప్రముఖులను ఉద్దేశించినవి కావని, ఈ అంశంపై ఇప్పటికే ఏఐసీసీ పెద్దలకు వివరణ ఇచ్చినట్లు కొండా మురళీ పేర్కొన్నారు.

Konda Murali Konda Sureka
Konda Murali: వరంగల్ కాంగ్రెస్‌లో కొండా దంపతులు వర్సెస్ కాంగ్రెస్ నేతలు అన్నట్లుగా కొద్దిరోజులుగా మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధిష్టానం పెద్దలకు ఒకరిపై ఒకరు ఫిర్యాదులుసైతం చేసుకున్నారు. ఈ క్రమంలో గాంధీ భవన్‌కు వచ్చి క్రమశిక్షణ కమిటీకి కొండా మురళీ నివేదిక ఇచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలపై వారంరోజుల్లో లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ ఆదేశించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో గురువారం ఉదయం కొండా దంపతులు మంత్రి కొండా సురేఖ, కొండా మురళీలు హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షీ నటరాజన్‌తో భేటీ అయ్యారు. ఉమ్మడి వరంగల్ లో జరుగుతున్న అంశాలపై ఆమెకు నివేదిక ఇచ్చారు.
Also Read: రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్.. ఈ నెలలోనే.. డేట్ ఇదే.. మీరు అప్లై చేశారా?
కొండా మురళి అందించిన నివేదికలో ఆయన సతీమణి, మంత్రి కొండా సురేఖ సమంత, నాగార్జునపై చేసిన కామెంట్స్ పైనా వివరణ ఇచ్చారు. మహేష్ బాబు, రాజమౌళిలపై కొండా సురేఖ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఫోన్ ట్యాపింగ్ విషయంలో జరిగిన అంశాలను మాత్రమే తాను పేర్కొన్నట్లు చెప్పారు. కొందరు కావాలని సురేఖ వ్యాఖ్యలను వక్రీకరించినట్లు మురళీ ఆ నివేదికలో పేర్కొన్నారు. కొండా సురేఖ ఫోన్ ట్యాపింగ్ విషయాలను చెప్పింది తప్పా.. సినీ ప్రముఖులను ఉద్దేశించినవి కావని అన్నారు. ఈ అంశంపై ఇప్పటికే ఏఐసీసీ పెద్దలకు వివరణ ఇచ్చినట్లు మురళీ పేర్కొన్నారు.
మీనాక్షి నటరాజన్‌తో భేటీ తరువాత కొండా మురళీ మీడియాతో మాట్లాడారు. నేను మొదటిసారి ఇన్‌ఛార్జిని కలిశా.. రేపటి సభకు వరంగల్ నుంచి ఎంత జనసమీకరణ చేయాలని డిస్కస్ చేశాం. కాంగ్రెస్ పార్టీని బతికించడం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం నా లక్ష్యం. రేవంత్ రెడ్డిని ఇంకో పదేళ్లు సీఎంగా ఉండేలా చూడడం నా లక్ష్యం. బీసీ బిడ్డగా పీసీసీకి అన్ని రకాలుగా నా మద్దతు ఉంటుందని అన్నారు. పనిచేసే వారిపైనే రాళ్లు పడతాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచేలా నేను బాధ్యత తీసుకుంటా. రేపు ఎమ్మెల్సీ ఎవరికి ఇచ్చినా గెలిపించే బాధ్యత నాదే. వైఎస్ఆర్ హయాం నుంచి మేము నిబద్దతతో పనిచేస్తున్నాం. మీ మద్దతునివ్వాలని ఇన్‌ఛార్జిని అడిగాం. ఇస్తామని ఆమె కూడా చెప్పారు. గ్రూపులు లేనిది ఎక్కడ..? నేను ఎవరికి బయపడేది లేదు. బీసీకార్డుతోనే పనిచేస్తా. బీసీల అభ్యున్నతికి పనిచేస్తా. నేను, సురేఖ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గాల్లో మాత్రమే ఇన్వాల్వ్ అవుతున్నా అంటూ కొండా మురళి చెప్పారు.
మంత్రి సురేఖ కామెంట్స్..
మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. తనకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నానని, మంత్రిగా ఇప్పటి వరకు ఎలాంటి తప్పులు చేయలేదని అన్నారు. కుమార్తె సుష్మిత రాజకీయాల్లోకి వచ్చే విషయంపై మాట్లాడుతూ.. మా ఇంట్లో ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి. నా కూతురు ఏమనుకుంటుందో నాకు ఎలా తెలుసు. పరకాల మాది. వంశపారంపర్యంగా పరకాల అడిగితే తప్పేంటి..? నా కూతురు ఫ్యూచర్ ఏంటో ఆమె డిసైడ్ అవుతుంది. భవిష్యత్తులో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అని అన్నారు.