నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత.. కృష్ణారాంపల్లి ప్రాజెక్టు పనులను అడ్డుకున్న భూనిర్వాసితులు

నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత.. కృష్ణారాంపల్లి ప్రాజెక్టు పనులను అడ్డుకున్న భూనిర్వాసితులు

Updated On : December 27, 2020 / 5:17 PM IST

Krishnarampally project’s victims protest for Compensation in Nalgonda : నల్గొండ జిల్లా మర్రిపాడు మండలంలో ఉద్రిక్తత నెలకొంది. కృష్ణారాంపల్లిలో భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. తమకు పూర్తి స్థాయి పరిహారం ఇచ్చేవరకూ కృష్ణారాంపల్లి ప్రాజెక్టు పనులు జరగనివ్వమని 300 మంది నిర్వాసితులు భీష్మించారు. రంగ ప్రవేశం చేసిన పోలీసులు భూ నిర్వాసితులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, నిర్వాసితులకు మధ్య తోపులాట జరిగింది. అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.. నిర్వాసితులను పోలీసులు బలవంతంగా పోలీస్‌ స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారు. దీంతో మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. వీరిని నాంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నాంపల్లి మండలం కృష్ణారాయినిపల్లి ప్రాజెక్టు పనులు చేపట్టారు. అయితే డిండి ఎత్తిపోతల పనుల శంకుస్థాపన సమయంలో భూనిర్వాసితులకు పరిహారం చెల్లించిన తర్వాతే పనులు జరుగుతాయని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత చాలాకాలం శివరాంపల్లి, కృష్ణరాయినిపల్లి, శివన్నగూడెంలో పనులు జరుగుతున్న క్రమంలో చాలా మంది భూనిర్వాసితులకు ఇంకా పరిహారం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే పలు సందర్భాల్లో భూనిర్వాసితులు పనులు అడ్డుకున్నారు. చాలా కాలంగా ప్రాజెక్టు పనులను ప్రతిసారి అడ్డుకుంటున్నా..అక్కడున్న అధికారులు, ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకోవడం లేదనే ఆరోపణ ఉంది.

ఇవాళ కృష్ణారాంపల్లి ప్రాజెక్టు వద్ద నాంపల్లి, మర్రిగూడెం మండలాలకు చెందిన దాదాపు 300 మందికిపైగా భూనిర్వాసితులు ఆందోళనకు దిగారు. ప్రాజెక్టు పనుల్లో భైటాయించారు. పరిహారంపై అధికారులు హామీ ఇచ్చే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకుకూర్చున్నారు. ఈ నేపథ్యంలో అక్కడున్న అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారందరిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట, ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు లాఠీలు కూడా ఝులిపించారు.

తోపులాటలో పలువురు భూనిర్వాసితులకు గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ఈ ఘర్షణలో కొంతమంది మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. చాలా సందర్భాల్లో భూనిర్వాసితులు ఆందోళనకు దిగుతున్నా.. అక్కడి అధికారులు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విషయంలో విఫలం అయ్యారనే ఆరోపణ కనిపిస్తోంది.

పరిహారాన్ని ప్యాకేజీల వారిగా అమలు చేస్తున్నారు. కొంతమందికి ఒకసారి, మరికొంతమందికి మరోసారి పరిహారం అందిస్తున్నారు. ఈ క్రమంలో ఒకే గ్రామంలో కొంతమందికి పరిహారం వచ్చి మరికొంతమందికి రాని దగ్గర ఈ సమస్య కనిపిస్తోంది. పరిహారం రానివారందరూ కలిసి ఇవాళ ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించిన పరిహారం ప్రభుత్వ స్థాయిలో ఉందని..ఇప్పటికే తామంతా నివేదికలు పంపామని అధికారులు తెలిపారు.

ప్రభుత్వం నుంచి విడుదలైన వెంటనే పరిహారం అందుతుందని, పరిహారం రావడం ఖాయమని చెప్పారు. పనులు అడ్డుకోవడం సరికాదన్నారు. గ్రామానికి ఉపయోగపడే అంశాన్ని అడ్డుకోవడం కరెక్టు కాదని అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇదే మాట చాలా కాలంగా చెబుతుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.