దమ్ముంటే లగచర్ల రా.. లేదా నన్నే కొడంగల్ రమ్మంటావా?.. సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్
కేంద్ర బడ్జెట్‌పై కూడా కేటీఆర్ స్పందించారు. ఆయన ఏమన్నారో తెలుసా?

KTR
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. వికారాబాద్, పరిగి నియోజకవర్గంలోని కులకచర్ల మండలం దాస్యా నాయక్ తండాలో ఏర్పాటు చేసిన బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించి మాట్లాడారు.
“రేవంత్ రెడ్డి దమ్ముంటే లగచర్లకు రావాలి. మీరు ఎలాగో రాలేరు కాబట్టి నేను కొడంగల్‌కు వస్తాను చర్చిద్దాం. హామీలు ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చారు. ప్రభుత్వ అధినేతలు జులుం చేస్తే ఊరుకోవద్దు.
రైతు రుణమాఫీ 25 శాతం కూడా పూర్తి కాలేదు. ఏ ఊరిలోనూ 100 శాతం రుణమాఫీ కాలేదు. రాజ్యాంగా మనకు ఇచ్చిన స్వేచ్ఛను ఉపయోగించి ప్రభుత్వాన్ని ప్రతిఒక్కరు నిలదీయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో సమకూర్చిన రూ.7 వేల కోట్లను రైతు బంధుగా వేశారు” అని కేటీఆర్ చెప్పారు.
బడ్జెట్‌పై ఏమన్నారు?
కేంద్ర బడ్జెట్‌పై కేటీఆర్ విమర్శలు గుప్పిస్తూ ప్రకటన చేశారు. “తెలంగాణకు చిల్లిగవ్వ కూడా తెచ్చుకోలేని సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఎంపీలు తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలి. జాతీయ పార్టీలు ఎప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి కేంద్ర బడ్జెట్ తో రుజువైంది.
రెండు పార్టీల నుంచి చెరో ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి పార్లమెంటుకు పంపితే, ఆ 16 మంది కలిసి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తెచ్చింది అక్షరాల గుండు సున్నా! సీఎంగా ఉంటూ బీజేపీకి గులాంగిరీ చేస్తూన్న బడే భాయ్-చోటే భాయ్ అనుబంధంతో తెలంగాణకు నయాపైసా లాభం లేదని తేలిపోయింది.
Cm Chandrababu : తల్లికి వందనం రూ.15వేలు, రైతులకు రూ.20వేలు డబ్బులపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..
ఇతర రాష్ట్రాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు తమ రాష్ట్రాలకు నిధుల వరద పారిస్తుంటే… తెలంగాణ బీజేపీ ఎంపీలు, నిస్సహాయ మంత్రులు చేతకాని దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారు. తెలంగాణకు నిధులు తేలేని బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ పార్టీ అయినా బీఆర్ఎస్‌కు ప్రాతినిధ్యం లేకుంటే జరిగే నష్టం ఏమిటో ప్రజలు గమనిస్తున్నారు. పార్లమెంటులో ప్రాంతీయ పార్టీలకు బలం ఉన్న బిహార్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు దక్కిన ప్రాధాన్యం చూసి… జాతీయ పార్టీలను గెలిపిస్తే తెలంగాణను నిండా ముంచారని ప్రజలకు అర్థమైంది.
కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ అంటే ఎంత చిన్నచూపో మరోసారి పార్లమెంట్ సాక్షిగా ఈ బడ్జెట్ రుజువు చేసింది. కేంద్ర బడ్జెట్ కేటాయింపులను చూస్తే, కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలకు పెద్దపీట వేసి, ఇతర రాష్ట్రాలకు అన్యాయం చేసింది. దేశ ఖజానా నింపే దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం” అని కేటీఆర్ చెప్పారు.