KTR: పీవీకి కూడా ఢిల్లీలో స్మారకం ఏర్పాటు చేయాలని సభలో తీర్మానం చేయాలి : కేటీఆర్

మన్మోహన్ సింగ్ ప్రధానిగాఉన్న సమయంలోనే బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కేబినెట్ లో ఏడాదిన్నరపాటు కేంద్ర మంత్రిగా కొనసాగారని ..

KTR: పీవీకి కూడా ఢిల్లీలో స్మారకం ఏర్పాటు చేయాలని సభలో తీర్మానం చేయాలి : కేటీఆర్

KTR

Updated On : December 30, 2024 / 12:16 PM IST

TS Assembly Special Session: ఢిల్లీలో పీవీ నర్సింహారావుకు కూడా స్మారకం ఏర్పాటు చేయాలని తెలంగాణ శాసన సభలో తీర్మానం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో మన్మోహన్ సింగ్ ను నివాళులర్పిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంతాప తీర్మానానికి బీఆర్ఎస్ తరపున పూర్తిగా మద్దతు ఇస్తున్నామని కేటీఆర్ తెలిపారు. అదేక్రమంలో మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని చేసిన ప్రతిపాదనకుకూడా మా మద్దతు సంపూర్ణంగా ఉంటుందని, భారత రత్నకు మన్మోహన్ అర్హుడని కేటీఆర్ పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ సామర్థ్యాన్ని, తేలివితేటలను మొట్టమొదటగా గుర్తించింది తెలంగాణ బిడ్డ, దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు అని అన్నారు. ఆర్భాటాలు, హడావుడి లేకుండా సింపుల్ లివింగ్.. హై థింకింగ్ అనే మాటకు పర్యాయ పదం మన్మోహన్ అని కేటీఆర్ కొనియాడారు.

Also Read: Telangana Assembly: మన్మోహన్ సింగ్ తెలంగాణకు ఆత్మబంధువు : అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి

మన్మోహన్ సింగ్ ప్రధానిగాఉన్న సమయంలోనే బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కేబినెట్ లో ఏడాదిన్నరపాటు కేంద్ర మంత్రిగా కొనసాగారని కేటీఆర్ గుర్తు చేశారు. నాడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని గెలుపొందిన తరువాత భాగస్వామ్య పక్షాలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కేసీఆర్ కు షిప్పింగ్ మంత్రి పదవి ఇస్తే.. ప్రభుత్వంలో కీలక భాగస్వామిగాఉన్న డీఎంకే ఆ పోర్టుఫోలియో మాకు కావాలని పట్టుబట్టింది. ఆ సమయంలో కేసీఆర్ మన్మోహన్ వద్దకు వెళ్లి తాను వచ్చింది పదవుల కోసమో, పోర్టుఫోలియోలకోసమో కాదు.. తెలంగాణ కోసమని కేసీఆర్ చెప్పారని.. దీంతో ఆ మంత్రిత్వ శాఖను డీఎంకేకి ఇచ్చారని కేటీఆర్ అన్నారు. అయితే, ఆ సమయంలో మన్మోహన్ స్పందిస్తూ.. ఏ నిబద్దతతో వచ్చారో అది ఫలించాలని కోరుకుంటున్నానని కేసీఆర్ తో చెప్పారని, మీరు తీసుకున్న నిర్ణయంతో గుర్తింపు వస్తుందని, కర్మయోగిగా గుర్తించబడతారని ఆనాడు కేసీఆర్ ను ఉద్దేశించి మన్మోహన్ అన్నారని కేటీఆర్ అసెంబ్లీలో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్న నిబద్దత, ఉద్యమానికి ఉన్న బలం, తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తి అన్నీ మన్మోహన్ సింగ్ కు అర్థమయ్యాయి కాబట్టే అనివార్య పరిస్థితుల్లో ఆయన నాయకత్వంలో తెలంగాణ ఏర్పాటు అయిందని, దానిని తాము మర్చిపోమని కేటీఆర్ పేర్కొన్నారు.

Also Read: Hyderabad: ముషీరాబాద్ చౌరస్తాలో కంటైనర్ వాహనం బీభత్సం.. ఒకరు మృతి, పోలీసులకు తప్పిన ప్రమాదం

కేసీఆర్ ఆదేశాల మేరకు ఢిల్లీకి వెళ్లి మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించాం. అంత్యక్రియల్లో పాల్గొన్నాం. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించామని కేటీఆర్ తెలిపారు. అక్కడికి వెళ్లినప్పుడు మన్మోహన్ సింగ్ కు జరిగిన గౌరవ ప్రదమైన వీడ్కోలు మన పీవీ నర్సింహారావుకు జరగలేదనే బాధ అనిపించింది. పీవీ నరసింహారావుకు కూడా ఢిల్లీలో స్మారకం ఏర్పాటు చేయాలని కోరుతూ తెలంగాణ శాసన సభ తీర్మానం చేయాలని, తెలంగాణ బిడ్డకు సముచిత గౌరవం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలనే ప్రతిపాదన సభ నుంచి వెళ్తే బాగుంటుందని కేటీఆర్ సభ దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీలో అందరు ప్రధానులకు స్మారకం ఉందని, మన పీవీ నర్సింహారావుకు మాత్రం లేదని, అది మనకు లోటుగా భావించి.. ఈ తీర్మానంతో పాటు దానిని కూడా జతపరిచి పంపించాలని సభలో కేటీఆర్ పేర్కొన్నారు.