Telangana Assembly: మన్మోహన్ సింగ్ తెలంగాణకు ఆత్మబంధువు : అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించేందుకు తెలంగాణ అసెంబ్లీ ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సమావేశంలో ఆయన సంతాప తీర్మానంను..

Manmohan singh
CM Revanth Reddy : మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ తెలంగాణకు ఆత్మబంధువు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈనెల 26న అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మన్మోహన్ సింగ్ (92) మృతిచెందిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్ లో మన్మోహన్ సింగ్ పార్ధీవ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించేందుకు తెలంగాణ అసెంబ్లీ ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సమావేశంలో ఆయన సంతాప తీర్మానంను సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టి మాట్లాడారు. నీతి, నిజాయితీలో మన్మోహన్ తో పోటీ పడేవారు లేరని అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ సలహదారుగా, ఆర్బీఐ గవర్నర్ గా పనిచేశారని అన్నారు. అదేవిధంగా ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా పనిచేసి దేశం ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు మన్మోహన్ సింగ్ సేవలందించారని రేవంత్ అన్నారు.
మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో మన్మోహన్ సహకారాన్ని మరవలేమని, తెలంగాణకు ఆయన ఆత్మబంధువు అని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది మన్మోహన్ సింగే నని.. ఆయన్ను తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారన్నారు. ఉపాధి హామీ, ఆర్టీఐ చట్టాల ఘనత మన్మోహనదేనని రేవంత్ అన్నారు. పదేళ్లు అద్భుతమైన పరిపాలన అందించారు. ఎవరెన్ని విమర్శలు చేసినా ఆయన తన పనితాను చేసుకునేవారు. మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read: Manmohan Singh: ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు.. పాడె మోసిన రాహుల్ గాంధీ
గతంలో ప్రభుత్వాలు భూ సేకరణ సమయంలో భూ యాజమానులతో సంబంధం లేకుండానే భూమిని సేకరించే పరిస్థితులు ఉండేవని, నష్టపరిహారంలోనూ అన్యాయం జరిగేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బ్రిటీష్ కాలంనాటి, దాదాపు 113 సంవత్సరాలుగా అమలవుతున్న భూసేకరణ చట్టంను 2013లో సవరించి కొత్త భూసేకరణ చట్టం తేవడం ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరిగిందని రేవంత్ పేర్కొన్నారు. గతంలో భూసేకరణ సమయంలో గ్రామాన్ని కోల్పోవాల్సి వచ్చినప్పుడు గ్రామంలో ఆస్తులున్న వారికి మాత్రమే నష్టపరిహారం వచ్చేది. కానీ, 2013 భూసేకరణ చట్టం ద్వారా భూమి, ఇల్లు లేకపోయినా గ్రామాన్నే నమ్ముకొని జీవనం సాగించే వారికి కూడా ఆర్ అడ్ ఆర్ ప్యాకేజీ అమలుచేసిన గొప్ప మానవతావాది మన్మోహన్ సింగ్ అని రేవంత్ రెడ్డి కొనియాడారు.