KTR: రేవంత్ రెడ్డికి కేటీఆర్ కీలక సూచన.. నువ్వు అలాచేస్తే తప్పకుండా గౌరవిస్తాం
రేవంత్ రెడ్డి వచ్చి ఏదో చెబితే నేర్చుకోవాల్సిన అవసరం, పట్టించుకోవాల్సిన అవసరం కేసీఆర్ కు లేదని కేటీఆర్ అన్నారు.

KTR Key Comments On CM Revanth
KTR Key Comments On CM Revanth: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛను హరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో నివాళులర్పించిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు. ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలుపుతుంటే అడ్డుకుంటున్నారని, బీఆర్ఎస్ నేతలను గృహనిర్భందం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నగరం నడిబొడ్డున కేసీఆర్ ఏర్పాటు చేశారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి గౌరవించుకున్నామని, కానీ, ప్రస్తుత ప్రభుత్వం తమ మీద అక్కసుతో అంబేద్కర్ వర్ధంతి నాడు కనీసం గేట్లు కూడా తెరవకుండా ఆ మహానీయున్ని నిర్భందించి, అవమానిస్తుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Gossip Garage : ఓవైపు సంబురం.. ఇంకోవైపు సమరం.. తెలంగాణ పాలిటిక్స్‌లో ఏం జరుగుతోంది.?
మర్యాద ఇచ్చిపుచ్చుకో..
కనీస మర్యాద, సంస్కారం లేకుండా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని కేటీఆర్ అన్నారు. గతంలో సోనియా గాంధీని బలిదేవత అని దూషించిన రేవంత్.. అదే పద్దతిలో తెలంగాణ ప్రదాత కేసీఆర్ గురించి ఆయన మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజలు చూశారని. రేవంత్ రెడ్డి వచ్చి ఏదో చెబితే నేర్చుకోవాల్సిన అవసరం, పట్టించుకోవాల్సిన అవసరం కేసీఆర్ కు లేదని కేటీఆర్ అన్నారు. మర్యాద అనేది ఒకరు అడుక్కుంటే రాదు.. ఇచ్చిపుచ్చుకుంటే వస్తుందని రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి. నీ నోరు మారితే.. నీ మాట మారితే.. నువ్వు కేసీఆర్ ను గౌరవిస్తే.. తప్పకుండా నీ పదవిని మేము గౌరవిస్తాం. నీ ముఖ్యమంత్రి స్థాయిని, నిన్ను గౌరవిస్తాం. నీ తీరు మారకపోతే నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నాసరే మేము వెనక్కి తగ్గమని కేటీఆర్ అన్నారు.
Also Read: Pushpa 2 Sandhya Theater Issue : మహిళ మృతి ఘటనలో వాళ్లందరిపై కేసు నమోదు.. కఠిన చర్యలు తీసుకుంటాం..
సభలో ప్రజా సమస్యలపై నిలదీస్తాం..
అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలకు సంబంధించిన ప్రశ్నలే అడుగుతామని కేటీఆర్ అన్నారు. మాపై పెట్టిన కేసుల గురించి మేము పట్టించుకోమని, ప్రజలు పడుతున్న ఇబ్బందులను సభలో లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. లఘచర్ల గురించి, గురుకులాల్లో అధ్వాన్న పరిస్థితులపై ప్రశ్నిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న వ్యవసాయ సంక్షోభం గురించి నిలదీస్తాం. ప్రభుత్వం నిర్వాకం వల్ల ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్న వైనాన్ని సభలో ప్రస్తావిస్తాం. 420 హామీలతో అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా.. అమలు చేయడం లేదని, వాటిపై అసెంబ్లీలో ప్రశ్నిస్తామని కేటీఆర్ అన్నారు. శాసన సభ సమావేశాలు నెల రోజులు నడపాలని, ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సభ్యులకు సమయం ఇవ్వాలని కేటీఆర్ అన్నారు.