జులై 3 నుంచి మరింత కఠినంగా హైదరాబాద్‌లో 15రోజులు లాక్‌డౌన్? రా.7 నుంచి ఉ.7 వరకు కర్ఫ్యూ

హైదరాబాద్ నగరంలో మరోసారి లాక్ డౌన్ విధించనున్నారా? 15 రోజుల పాటు లాక్ డౌన్ ఉంటుందా? ఇందుకు సీఎం కేసీఆర్ ఓకే చెప్పారా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. జులై 3 నుంచి హైదరాబాద్ నగరంలో లాక్‌డౌన్ విధించనున్నట్లుగా సమాచారం. రేపు(జూలై 1,2020) లేదా ఎల్లుండి(జూలై 2,2020) కేబినెట్ భేటీ జరిగే అవకాశం ఉంది. నగరంలో లాక్‌డౌన్ విధించే అంశంపై కేబినెట్ చర్చించనుంది. జులై 3వ తేదీ నుంచి 15 రోజులపాటు హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధించేందుకు ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా అనుమతి తెలిపినట్లుగా సమాచారం.
గతంకంటే భిన్నంగా, మరింత కఠినంగా లాక్ డౌన్:
గతంలో విధించిన లాక్‌డౌన్‌కు భిన్నంగా ఈసారి విధించబోయే లాక్‌డౌన్ ఉంటుందని సమాచారం. నిత్యావసర సరుకుల దుకాణాలు, మెడికల్ షాపులు మినహా అన్ని దుకాణాలను మూసివేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్ విధింపే సరైన చర్యగా నిపుణులు చెబుతున్నారు. జాగ్రత్త చర్యలు పాటించడంలో ప్రజలు విఫలమయ్యారని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలు సూచిస్తున్నాయి. స్వీయ క్రమశిక్షణ ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవన్నారు.
రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ:
అలాగే కరోనా కట్టడికి అధికారులు కొత్త మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ విధింపు, వైన్స్ షాప్స్ బంద్ కానున్నాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రవాణాశాఖ కార్యాలయాలను తెరిచి ఉంచే విషయమై ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. ఐటీ కార్యాలయాలు ఇప్పటికే 50 శాతం ఉద్యోగులతో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. నూతన మార్గదర్శకాల ప్రకారం ఈసారి లాక్‌డౌన్ నియమాలు కఠినంగా ఉండనున్నట్లు సమాచారం. వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల్లో వీటిని పటిష్టంగా అమలు చేయనున్నారు.
మరోవైపు 24 గంటలపాటు కరోనా పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సరోజిని కంటి ఆస్పత్రి, ప్రకృతి చికిత్సాలయం, ఆయుర్వేదిక్, చార్మినార్ నిజామియా ఆస్పత్రుల్లో రోగుల నుంచి స్వాబ్ శాంపిల్స్‌ను సేకరించి కరోనా పరీక్షల నిర్వహించనుంది.
లాక్ డౌన్ మినహా మరో మార్గం లేదు:
కొన్నిరోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దాదాపుగా వెయ్యి పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే ఐదు వందలకు పైగా కేసులు రికార్డ్ అవుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వర్తక, వ్యాపార సంఘాలు స్వచ్చందంగా లాక్ డౌన్ పాటిస్తున్నాయి. మరోసారి లాక్ డౌన్ విధించాల్సిందేనని ప్రజలు సైతం ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో ప్రజల సంక్షేమం దృష్ట్యా మరోసారి లాక్ డౌన్ విధించడమే మంచిదనే యోచనలో ప్రభుత్వం కూడా ఉంది.
Read:తెలంగాణాలో ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా..