Lockdown Telangana : తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ తప్పదా?

తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్‌ తప్పదా..? కరోనా కట్టడికి లాక్‌డౌనే మార్గమా..? ఆంక్షలపై కేసీఆర్‌ సర్కార్‌ కసరత్తు చేస్తోందా..?

Lockdown Telangana : తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ తప్పదా?

Lockdown Likely In Telangana Once Again

Updated On : April 25, 2021 / 2:36 PM IST

lockdown likely in Telangana ? : తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్‌ తప్పదా..? కరోనా కట్టడికి లాక్‌డౌనే మార్గమా..? ఆంక్షలపై కేసీఆర్‌ సర్కార్‌ కసరత్తు చేస్తోందా..? ఆర్థిక భారం పడకుండా.. ప్రజలకు నష్టం జరగకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో.. రాష్ట్ర వ్యాప్తంగా పాక్షిక లాక్‌డౌన్‌ పెట్టేందుకు కేసీఆర్‌ సర్కార్‌ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

అటు దేశంలో.. ఇటు రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో.. కట్టడి చర్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్‌ అయ్యాయి. తెలంగాణలో రోజుకు 8 వేలకుపైగా కేసులు వస్తుండటంతో.. కట్టడి చర్యలపై దృష్టి పెట్టింది తెలంగాణ సర్కార్. కరోనా కట్టడికి చేయాల్సిన.. ప్రభుత్వం ముందున్న మార్గాలపై కసరత్తు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే నైట్ కర్ఫ్యూ పెట్టి కేసులు తగ్గించడంపై దృష్టి సారించారు.

కానీ.. నైట్ కర్ఫ్యూతో కేసులు తగ్గకపోవడంతో ఏం చేస్తే కేసులు తగ్గుతాయనే అంశంపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని భావిస్తోంది. ఇప్పటికే మాస్క్‌ ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలివ్వడం.. స్కూళ్ల మూసివేత.. నైట్ కర్ఫ్యూను విధించినా పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో.. పాక్షిక లాక్‌డౌన్ గురించి ఆలోచిస్తోంది… మే 2 తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి….

ఇప్పటికే కేంద్ర, రాష్ట్రాలు కరోనా కట్టడికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ.. కంటోన్మెంట్ జోన్ల ఏర్పాటు.. మరికొన్ని రాష్ట్రాల్లో పాక్షిక లాక్‌డౌన్‌ని అమలు చేస్తున్నారు. ఇక తెలంగాణలోని చాలా గ్రామాల్లో ప్రజలు స్వచ్చందంగా లాక్‌డౌన్ విధించుకున్నారు. మరోపైపు జనాలు విచ్చలవిడిగా బయటికి రావడం, కరోనా పేషెంట్లు కూడా క్వారంటైన్ పూర్తవకముందే రోడ్ల మీద తిరుగుతూ.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండటం ప్రభుత్వాలకు సవాల్‌గా మారింది.

దీంతో.. పాక్షిక లాక్‌డౌన్ పెడితేనే బాగుంటుందనే ఆలోచనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నట్లుగా సమాచారం. కేంద్ర ప్రభుత్వం మే నెల 2వ తేదీన ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. హైకోర్టు ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించింది. మరో రెండు రోజుల్లోనే కట్టడి చర్యలపై పూర్తిస్థాయిలో సమీక్షించి.. పాక్షిక లాక్‌డౌన్‌పై కేసీఆర్‌ సర్కార్‌ ఓ నిర్ణయం తీసుకోనుంది.