భువనగిరి నుంచి పోటీ చేయాలని నన్ను రాజగోపాల్ రెడ్డి కోరారు: మధుయాష్కీ గౌడ్ కీలక వ్యాఖ్యలు

Madhu Yaskhi Goud: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీలు రాజకీయంగా బాగా నష్టపోతున్నారని అన్నారు.

భువనగిరి నుంచి పోటీ చేయాలని నన్ను రాజగోపాల్ రెడ్డి కోరారు: మధుయాష్కీ గౌడ్ కీలక వ్యాఖ్యలు

Madhu Yashki Goud

భువనగిరి నుంచి పోటీ చేయాలని తనను మంత్రి రాజగోపాల్ రెడ్డి కోరారని కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ అన్నారు. తనను గెలిపించుకునే బాధ్యతను తీసుకుంటానని రాజగోపాల్ రెడ్డి అంటున్నారని, అయినా తనకు పోటీ చేయడం ఇష్టం లేదని చెప్పానని వివరించారు.

ఇవాళ మధుయాష్కీ గౌడ్ మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. బీసీలకు టికెట్లు ఇవ్వాలనుకుంటే ఎవరికైనా ఇచ్చుకోండని చెప్పినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీలు రాజకీయంగా బాగా నష్టపోతున్నారని అన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు అవకాశాలు అధికంగా వచ్చాయని చెప్పారు. 2014కు ముందు ఆరుగురు బీసీ ఎంపీల ఉండేవాళ్లమని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనలాంటి వారు కూడా టికెట్ కోసం పోరాడాల్సి వచ్చిందని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇంకా వెనకబడిపోతున్నారని అన్నారు.

ఏపీలో జగన్‌కు బీసీల ప్రాధాన్యం తెలుసని, అందుకే తెలంగాణకు చెందిన బీసీ నేత ఆర్.కృష్ణయ్యకు ఏపీ నుంచి రాజ్యసభ సభ్యత్వం ఇప్పించారని మధుయాష్కీ గౌడ్ చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని బదిలీలు కేటీఆర్ పరిశీలనలోనే జరిగాయని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేటీఆర్ చేయించి ఉండొచ్చని ఆరోపించారు.

ఈ కేసులో ఏ1, ఏ2గా కేసీఆర్, కేటీఆర్ నిలుస్తారని చెప్పారు. అధికారుల విచారణ అయిన తర్వాత కేసీఆర్, కేటీఆర్ ను విచారించే అవకాశం ఉందని అన్నారు. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసు ఫేక్ కేసు అని అంటున్నారని, నేరం చేయలేదని మాత్రం చెప్పడం లేదని తెలిపారు.

 Also Read: ఏపీ మంత్రి రోజాపై చంద్రబాబు నాయుడు విమర్శలు