Maha Shivaratri : శివరాత్రి వేళ భక్తులకు గుడ్న్యూస్.. ఆ ప్రాంతాలకు స్పెషల్ బస్సులు.. వారికి ఉచితంగా ప్రయాణం
Maha Shivaratri : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 43 శైవక్షేత్రాలకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపుడుతుంది.
Maha Shivaratri
- మహా శివరాత్రికి టీజీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు
- 43 శైవక్షేత్రాలకు 2,243 ప్రత్యేక బస్సులు
- 14 నుంచి 16వ తేదీ వరకు అందుబాటులో
- మహిళలకు ఉచిత బస్సు సదుపాయం
Maha Shivaratri : హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో మహా శివరాత్రి ఒకటి. భోళేనాథుడైన పరమశివుడిని ఆరాధించడానికి ఈరోజు ప్రత్యేకమైనది. శివరాత్రి రోజు శివాలయాలు “ఓం నమః శివాయ” అనే నామస్మరణతో మార్మోగుతాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల కోసం టీజీఎస్ఆర్టీసీ భారీ ఏర్పాట్లు చేసింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా శైవక్షేత్రాలకు స్పెషల్ బస్సులను నడిపేందుకు సిద్ధమైంది.
Also Read : Telangana Govt : తెలంగాణలోని రైతులకు గుడ్న్యూస్.. సర్కార్ మరో కీలక నిర్ణయం..
శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 43 శైవక్షేత్రాలకు మొత్తం 2,243 ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ స్పెషల్ బస్సులు ఈనెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మూడురోజుల పాటు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
రాష్ట్రం నుంచి అత్యధికంగా శ్రీశైలం క్షేత్రానికి 781 బస్సులను కేటాయించారు. వేములవాడకు 416, కీసరగుట్టకు 326 బస్సులు, ఏడుపాయలకు 249 బస్సులు, వేలాలకు 127, కాళేశ్వరానికి 71 స్పెషల్ బస్సులను టీజీఎస్ఆర్టీసీ నడపనుంది. వీరిటితోపాటు కొమురవెల్లి, అలంపూర్, ఉమాహేశ్వరం, పాలకుర్తి, రామప్ప ఆలయాలకు మరో 273 బస్సులను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్బీ, బీహెచ్ఈఎల్ పాయింట్ల నుంచి బస్సులు బయలుదేరతాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
అయితే, శివరాత్రి స్పెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీలను వసూళ్లు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో ప్రకారం.. ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీల కంటే 50శాతం ఎక్కువగా వసూలు చేయనున్నారు. రెగ్యులర్ సర్వీసుల్లో మాత్రం పాత ఛార్జీలే ఉంటాయని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు.
మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు టీజీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే, శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డనరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు జీరో టికెట్ తీసుకొని ఉచితంగా ప్రయాణించవచ్చునని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
