Telangana Govt : తెలంగాణలోని రైతులకు గుడ్న్యూస్.. సర్కార్ మరో కీలక నిర్ణయం..
Telangana Govt : రైతులు ఎదుర్కొంటున్న నకిలీ విత్తనాల బెడదను నివారించడంతోపాటు అన్నదాతలకు అన్నివిధాల లబ్ధి చేకూర్చడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని, పంటల దిగుబడిని పెంచేందుకు, రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ విధానం దోహదపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
Telangana Farmers
- రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్
- విత్తన సహకార సంఘాల ఏర్పాటుకు నిర్ణయం
- మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 97 విత్తన సహకార సంఘాలు
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, పంటల సాగులో అధిక దిగుబడులు సాధించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే రైతు భరోసా పేరుతో పెట్టుబడి సాయం అందిస్తున్న ప్రభుత్వం.. రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమలు చేస్తోంది. మరోవైపు సబ్సిడీపై రుణాలను అందిస్తున్న ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read : మున్సిపల్ ఎన్నికల ప్రచారం మొత్తం వీటి చుట్టే తిరిగింది.. ఇలాగైతే ఎలా?
పంటల సాగులో రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య నకిలీ విత్తనాలు. ప్రస్తుతం మార్కెట్లో నకిలీ విత్తనాలతో అనేక మంది రైతులు నష్టపోతున్నారు. నకిలీ విత్తనాలను విత్తడం ద్వారా సరియైన దిగుబడిరాక అప్పుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు తీపి కబురు చెబుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
నాణ్యత, అధిక ఉత్పాదకత, దిగుబడుల సాధన లక్ష్యాలతో దేశంలో మొదటిసారిగా విత్తన సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ఈ సంఘాలకు నాబార్డు ఆర్థిక సాయం అందించనుంది. ఈ విత్తన సహకార సంఘాల ద్వారా నాణ్యమైన విత్తనోత్పత్తి చేయించడం, వాటికి బ్రాండింగ్ ఇచ్చి రైతులకు నేరుగా పంపిణీ చేయడం ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఇందులో రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖలు భాగస్వాములుగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
ప్రతీయేటా నకిలీ విత్తనాల వల్ల అనేక మంది రైతులు నష్టపోతున్నారు. నకిలీ విత్తనాల వల్ల నష్టపోతున్న రైతులకు సరియైన న్యాయం కూడా జరగడం లేదు. విత్తన చట్టంలోని లోపాల కారణంగా రైతులకు తగిన పరిహారం కూడా అందడం లేదు. విత్తన కంపెనీల ఆధ్వర్యంలో కొందరు అన్నదాతలు విత్తనాల ఉత్పత్తి చేపడుతున్నప్పటికీ.. వారికి ఆశించిన లాభాలు రావడం లేదు. ఈ నేఫథ్యంలో రాష్ట్రంలో విత్తన వ్యవస్థపై వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేకంగా అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
రాష్ట్రంలో విత్తన ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాల్సి ఉందని, అందుకు ప్రత్యేకంగా రైతులతోనే సహకార సంఘాలను కూడా ఏర్పాటు చేయాలని నివేదిక పేర్కొంది. ఈ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ప్రతిపాదనలు కోరింది. ఆ తరువాత అగ్రివర్సిటీ అధికారులు నాబార్డుతో చర్చలు జరిపారు. వ్యవసాయ రంగ ప్రోత్సాహక నిధి కింద గ్రాంటు ఇచ్చేందుకు నాబార్డుతో చర్చలు జరిపారు. వ్యవసాయ రంగ ప్రోత్సాహక నిధి కింద గ్రాంటు ఇచ్చేందుకు నాబార్డు ముందుకు వచ్చింది. ఆ మేరకు విత్తన సహకార సంఘాల ఏర్పాటుకు అగ్రివర్శిటీ ప్రతిపాదనలు సమర్పించింది.
రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశలో 97 విత్తన సహకార సంఘాల (జిల్లాకు 3 చొప్పున, ఒక జిల్లాలో నాలుగు)ను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికొచ్చింది. ఒక్కో సంఘంలో 30 నుంచి 40 మంది ఆదర్శ రైతులు సభ్యులుగా ఉంటారు. నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి, ప్యాకేజింగ్, పంపిణీ వంటి వాటిపై వారికి శిక్షణ ఇస్తారు. విత్తన సహకార సంఘాలు ఉత్పత్తి చేసే విత్తనాలకు తెలంగాణ సీడ్ పేరిట బ్రాండింగ్ ఇస్తారు. వాటిని వ్యవసాయ సహకార సంఘాల్లోని సభ్యులకు పంపిణీ చేస్తారు. మిగిలితే ఇతర రైతులకు రాయితీపై విక్రయిస్తారు.
రైతులు ఎదుర్కొంటున్న నకిలీ విత్తనాల బెడదను నివారించడంతోపాటు అన్నదాతలకు అన్నివిధాల లబ్ధి చేకూర్చడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని, పంటల దిగుబడిని పెంచేందుకు, రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ విధానం దోహదపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. వానాకాలం సీజన్ నాటికి విత్తనాలను పంపిణీ చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
