వీడు సామాన్యుడు కాదు, హైదరాబాద్ శివారులో 240 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా

man occupied 240 Acres land in Vikarabad: హైదరాబాద్ నగర శివారులో మరో భారీ భూ కుంభకోణం బయటపడింది. సాజిద్ నవాబ్ అనే వ్యక్తి ఏకంగా 240 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడు. వికారాబాద్ అడవుల్లో దర్జాగా ప్రభుత్వ భూమిని లాక్కున్నాడు. కబ్జా మాత్రమే కాదు అక్కడ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. చుట్టుపక్కల గ్రామాల్లో అలజడి సృష్టించడం హాబీగా మార్చుకున్నాడు. అడవి జంతువులను వేటాడటమే కాకుండా వాటి మాంసాన్ని వండుకుని తినేవాడన్న ఆరోపణలూ ఉన్నాయి.
ఇన్నాళ్లు అధికారులను గుప్పిట్లో పెట్టుకుని సాజిద్ ఆటాడుతూ వచ్చాడు. కానీ ఇప్పుడో కలెక్టర్ అతడికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అపరకాళిగా వచ్చిన వికారాబాద్ కలెక్టర్ పౌసుమి బసు అన్ని లెక్కలు తేలుస్తున్నారు. సాజిద్ పని పడుతున్నారు. 240 ఎకరాల కబ్జా భూమిని విడిపించే ప్రయత్నంలో ఉన్నారు. దీనిపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
”హైదరాబాద్ కి చెందిన సాజిద్ నవాబ్ 240 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడు. అధికారులను, గ్రామస్తులను రానిచ్చే వాడు కాదు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. అవినీతి పోలీసుల సపోర్టుతో రెచ్చిపోయాడు. బెదిరింపులకు పాల్పడేవాడు. కొట్టేవాడు. రాజకీయ నాయకుల పలుకుబడితో రెచ్చిపోయి అరాచకాలు చేశాడు. ఎవరైనా ఎదురు తిరిగితే చంపేసేవాడు. ఇలా ఎన్నో దౌర్జన్యాలు, అరాచకాలు చేశాడు. క్రికెట్ ఆడేందుకు వస్తే గ్రామానికి చెందిన పిల్లలను కొట్టాడు” – గ్రామస్తుడు.