HCU Student Suicide : హెచ్ సీయూలో ఎంటెక్ విద్యార్థిని మౌనిక ఆత్మహత్యపై అనేక అనుమానాలు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఎంటెక్ విద్యార్థిని మౌనిక ఆత్మహత్యపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేయగా సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు.

Mounika
Many suspicions over mounika suicide : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఎంటెక్ విద్యార్థిని మౌనిక ఆత్మహత్యపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఇప్పటికే దీన్ని అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేయగా.. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అసలు ఆ సూసైడ్ నోట్ మౌనికనే రాసిందా? అందులో ఉన్నది ఆమె రైటింగేనా? బెడ్ షీట్‌తో కిటికీకి ఊరేసుకోవడమేంటి? అది కూడా చాలా తక్కువ ఎత్తులో ఉన్న కిటికీకి అది ఎలా సాధ్యమన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఒకవేళ నిజంగా మౌనిక ఆత్మహత్యనే చేసుకుంటే.. దానికి గల కారణాలను సూసైడ్ నోట్‌లో ఎందుకు రాయలేదన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. చూడటానికి ఆత్మహత్యలా కనిపిస్తున్నా… అసలు కారణాలు ఏంటన్నది మిస్టరీగా మారింది.
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లి గ్రామానికి చెందిన రఘుశాల లచ్చయ్య, రజిత దంపతుల కూతురు మౌనిక. ఆమె వయసు 27ఏళ్లు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఎంటెక్ చేస్తోంది. నానో టెక్నాలజీ సెకండ్ ఇయర్ చదువుతున్న మౌనిక.. క్యాంపస్‌లోనే విమెన్స్ హాస్టల్-7లో ఉంటోంది. రోజులాగే గదిలోంచి బయటకు రావాల్సిన మౌనిక నిన్న ఎంత సేపైనా రాలేదు. రోజూ అందరి కంటే ముందే వచ్చే ఆమె ఆ రోజు రాకపోవడంతో… ఏ జ్వరమో వచ్చిందేమోనని అందరూ భావించారు.
తోటి విద్యార్థులు వెళ్లి పిలిస్తే… రూమ్‌లో నుంచి స్పందన లేదు. ఎంతసేపు పిలిచినా పలకలేదు. ఆమెకు కాల్ చేసినా రిసీవ్ చేసుకోలేదు. ఏమై ఉంటుందో విద్యార్థులకు అర్థం కాలేదు. తలుపు చూస్తే… లోపల గడియ వేసి ఉంది. దాంతో విద్యార్థులు రకరకాలుగా ఆలోచించారు. ఆ టెన్షన్‌లోనే వెంటిలేటర్‌లోంచి చూశారు. అంతే కిటికీ చువ్వకు ఉరివేసుకుని కనిపించిందీ మౌనిక. దాంతో… అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఇక మౌనిక ఆత్మహత్య చేసుకుందన్న అంశం ఇతర విద్యార్థులందర్నీ తీవ్ర విషాదంలో ముంచేసింది. సూసైడ్ నోట్‌గా భావిస్తున్న ఓ పేపర్‌లో ఆమె రాసిన అక్షరాలు అందర్నీ కలచివేస్తున్నాయి. “ఐయామ్ సో బ్యాడ్ డాటర్.. మిస్ యూ నాన్న.. అమ్మ” అని రాసినట్లు ఉంది. గచ్చిబౌలి స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరగడంతో… అక్కడి పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇది సూసైడేనా లేక… అలా ఎవరైనా క్రియేట్ చేశారా అన్న అంశాన్ని పరిశీలిస్తున్నారు.
కరోనా వ్యాప్తి తగ్గడంతో… ఎంటెక్ విద్యార్థులను క్యాంపస్‌లోకి ఈ మధ్యే అనుమతించారు. ఈనెల 18న హాస్టల్ గదికి వచ్చి ఉంటోంది మౌనిక. ఆమె తండ్రి లచ్చయ్య ఊళ్లో వ్యవసాయం చేస్తున్నారు. పదో తరగతి వరకు ఊళ్లోని గవర్నమెంట్ స్కూల్లో చదివిన మౌనిక… ఆ తర్వాత బాసర ట్రిపుల్‌ఐటీలో సీటు సంపాదించింది. అక్కడ ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని హెచ్‌సీయూలో ఎంటెక్‌లో చదువుతోంది.