Telangana Rains : వర్షాలపై బిగ్ అప్డేట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..
Telangana Rains : తెలంగాణలోని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Telangana Rains
Telangana Rains : తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తుండగా.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అయితే, తాజాగా వాతావరణ శాఖ రాష్ట్రంలో వర్షాలపై ప్రజలకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాల ప్రభావం ఉండే అవకాశం ఉందని, పలుజిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని పేర్కొంది.
Also Read : Konda Surekha : మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్.. అటవీ శాఖలో డిప్యూటేషన్లకు సడన్ బ్రేక్!
రాష్ట్రంపై ద్రోణి తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగుతుండగా.. నైరుతి రుతుపవనాలు తేమతో నిండి ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలో రెండుమూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం బెంగాల్, జార్ఖండ్, ఉత్తర ఒడిశా ప్రాంతాలపై అల్పపీడన ప్రాంతం కొనసాగుతుండగా.. అది క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని, అదే సమయంలో బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి సుమారు 5.8కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవర్తనం విస్తరించి దక్షిణం వైపు వంగి ఉందని.. ఇది రానున్న 24గంటల్లో వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉండటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు కారణమవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తాజా పరిణామాల నేపథ్యంలో ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున వర్షం కురిసింది. మంగళ, బుధవారాల్లో నగరంలో మోస్తరు నుంచి భారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే, తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు లేదంటే పొడి వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు.
వర్షాలతోపాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. కొన్ని సందర్భాల్లో గాలుల వేగం 60కిలో మీటర్ల వరకు చేరొచ్చునని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, హోర్డింగ్, విద్యుత్ స్తంభాలు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.
