Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం.. నేడు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక సూచనలు
Rain Alert : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వింత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ఎండలు దంచికొడుతుండగా.. మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి.
Heavy Rain
Rain Alert : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వింత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10గంటలు దాటితే ఎండ తీవ్రతకు బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. పలు ప్రాంతాల్లో 40డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం సమయాల్లో ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇదే సమయంలో సాయంత్రం వేళ వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉన్నట్లుండి ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.
ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఛత్తీస్గఢ్లో ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి తెలంగాణ, రాయలసీమతో పాటు తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర, దక్షిణ ద్రోణి ఏర్పడిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఏపీ, తెలంగాణలో వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది.
తెలంగాణ, రాయలసీమ మీదుగా మన్నార్ వరకు ద్రోణి కొనసాగుతుండటంతో.. ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో గురువారం తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ అయింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలతోపాటు.. అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఎండల తీవ్రతకూడా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం పల్నాడు జిల్లా క్రోసూరు, తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో అత్యధికంగా 42.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా చిత్తూరు, నంద్యాల, కడప, అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 41డిగ్రీలకుపైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లా పైడిమెట్లలో 44 మి.మీ, కాకినాడ జిల్లా డి.పోలవరంలో 37.7 మి.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణలో మూడు రోజుల పాటు ఆయా జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాలలో గురువారం అక్కడక్కడా మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ జారీ చేసింది.
