తెలంగాణలో కుండపోత వర్షాలు.. నేడు ఈ జిల్లాలకు హైఅలర్ట్.. హైదరాబాద్‌లోనూ ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వాన..

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. దక్షిణ కోస్తాంధ్ర తీరం వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ

తెలంగాణలో కుండపోత వర్షాలు.. నేడు ఈ జిల్లాలకు హైఅలర్ట్.. హైదరాబాద్‌లోనూ ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వాన..

Updated On : August 10, 2025 / 7:05 AM IST

Telangana Rains: తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో మరోసారి కుండపోత వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారులపైకి భారీగా నీరు చేరడంతో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇవాళ కూడా నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రాష్ట్రంలోనూ కుండపోత వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. దక్షిణ కోస్తాంధ్ర తీరం వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారంతోపాటు సోమ, మంగళవారాల్లోనూ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, నాగర్ ‌కర్నూల్, కుమురం భీం ఆసిఫాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, జనగామ, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

హైదరాబాద్‌లో శనివారం రాత్రికురిసిన భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కుండపోత వాన నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు.

హయత్ నగర్ సర్కిల్ పరిధిలో 6 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సరూర్ నగర్, ఎల్బీనగర్, గోశామహల్, బేగంపేట్ సర్కిళ్ల పరిధిలో 2 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలోని రోడ్లు వాగులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూసికి భారీగా వరద నీరు చేరుతుంది. అయితే, హైదరాబాద్‌లో మరో మూడు రోజులపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు.