Rain Alert: 24గంటల్లో భారీ వర్షాలు.. తెలంగాణలో హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో హైఅలర్ట్.. ఉప్పొంగుతున్న గోదావరి..

తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ నగరం సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది.

Rain Alert: 24గంటల్లో భారీ వర్షాలు.. తెలంగాణలో హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో హైఅలర్ట్.. ఉప్పొంగుతున్న గోదావరి..

Rain Alert

Updated On : July 26, 2025 / 1:11 PM IST

Rain Alert: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ నగరంసహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఏపీతోపాటు తెలంగాణలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. ప్రస్తుతం వాయుగుండం తీరందాటి ద్రోణిగా రూపాంతంరం చెందిందని, దీని ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయి. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి.

హైదరాబాద్ జిల్లాలో వర్షం దంచికొడుతుంది. శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. శనివారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో రాకపోకలు సాగించేందుకు నగర వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు.. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుటుర్కొంటున్నారు.

ఎడతెరిపిలేని వర్షంతో జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వర్షప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను చేపడుతున్నారు. అయితే, హైదరాబాద్లో మరో రెండ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

హైదరాబాద్ తోపాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

మరో నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, పిడుగులు పడే అవకాశం ఉండటంతో వర్షంపడే సమయాల్లో ప్రజలు చెట్ల కిందకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

భారీ వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి నదుల ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. శ్రీశైలం జలాశయం నుంచి 20వేల క్యూసెక్కుల వరద సాగర్‌కు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం నాగార్జున సాగర్‌లో నీటిమట్టం 580.20 అడుగులకు చేరింది. 283. 5924 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జూరాలలో వరద కొనసాగుతుండటంతో ఐదు గేట్లు ఎత్తి 95వేల 416 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం 317.390మీటర్ల నీటి మట్టం,7.444 టీఎంసీలు నీటి నిల్వ ఉంది.
కాళేశ్వరం వద్ద వరద ఉధృతి పెరిగింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద ఔట్ ఫ్లో 3 లక్షల 41 వేల క్యూసెక్కులుగా ఉంది. 85గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నీటిమట్టం 8.700 మీటర్లుగా ఉంది.