కేటీఆర్, హరీశ్ రావుకు నిద్ర పట్టలేదు.. అందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారు: జూపల్లి కృష్ణారావు
పదేళ్లలో బీఆర్ఎస్ గొప్ప పాలన చేస్తే పది లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎందుకు అయ్యాయని జూపల్లి కృష్ణారావు నిలదీశారు.

Minister Jupally Krishna Rao
Jupally Krishna Rao: రైతు పండగ చూసి మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుకు నిద్ర పట్టలేదని, సోషల్ మీడియాతో తిమ్మిని బమ్మిని చేసి ప్రచారం చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడారు.
నిన్న మహబూబ్ నగర్‌లో భారీ ఎత్తున రైతు పండగ సభ నిర్వహించారని, పాలమూరు ప్రజల తరఫున సీఎంకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులు గత పదేళ్లలో పూర్తి కాలేదని, ప్రాజెక్టులు అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రారంభించాయని చెప్పారు. కేసీఆర్ ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదని, మరో 40-50 వేల కోట్ల రూపాయల ఖర్చు చేస్తే ప్రాజెక్టులు పూర్తి అవుతాయని తెలిపారు. ఇప్పటివరకు 20-30 శాతం మాత్రమే ప్రాజెక్టుల పనులు జరిగాయని చెప్పారు.
పదేళ్లలో బీఆర్ఎస్ గొప్ప పాలన చేస్తే పది లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎందుకు అయ్యాయని జూపల్లి కృష్ణారావు నిలదీశారు. నెలకు ఆరువేల కోట్ల రూపాయలు వడ్డీలు కట్టాల్సి వస్తుందని తెలిపారు. రింగురోడ్డును అమ్ముకున్నారని, గత పాలనలో మంత్రులకు ప్రగతి భవన్ లోకి ఆహ్వానం లేదని చెప్పారు. సెక్రటేరియట్లోకి ఎమ్మెల్యేలకు అనుమతి లేదని, ప్రతిపక్ష పార్టీల గారడీలో ప్రజలు పడకుండా ఉండాలని అన్నారు. కాంగ్రెస్ పాలన దేశానికి, రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పారు.