కొండా దూకుడుతో హస్తం పార్టీకి తలనొప్పులు.. ఒకటి ముగియకముందే మరో వివాదం
వరుస వివాదాలతో కొండంత భారమైన సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించేందుకే ఈ వ్యవహారం జరుగుతోందన్న టాక్ నడుస్తోంది.

Konda Surekha
ఆమె ఓ ఫైర్ బ్రాండ్ లీడర్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పట్టున్న కుటుంబం. పైగా క్రౌడ్ పుల్లర్స్. ఏ పార్టీలో ఉన్నా తమదైన ముద్ర వేసే చాణక్యం. బలమైన సామాజిక సమీకరణం. ఇంకేముంది జిల్లాలో కొండా దంపతులే పార్టీకి పెద్ద దిక్కు అనుకుంది కాంగ్రెస్. అయితే అమాత్య యోగం దక్కించుకున్న ఆమె…ఇప్పుడు పార్టీకే కొండంత భారం అవుతున్నారట.
ఆల్రెడీ సీతక్కకు ఓరుగల్లు జిల్లా కోటాలో మంత్రి పదవి ఇచ్చినా..రాజకీయ పలుకుబడి, బీసీ కార్డు ఉన్న కొండా సురేఖకు కూడా క్యాబినెట్లో అవకాశం కల్పించారు. అయితే వరంగల్ జిల్లా రాజకీయమంతా తన కనుసైగల్లోనే నడవాలన్నట్లుగా డామినేట్ చేస్తున్నారట కొండా సురేఖ. ఆ వ్యవహారమంతా అంతర్గతంగా నడుస్తుండగానే..కేటీఆర్తో కయ్యానికి దిగారు మంత్రిగారు.
ఆయనను టార్గెట్ చేయబోయి ఓ నటిని వివాదంలోకి లాగి పెద్ద దుమారానికి కారణమయ్యారు. అటు బిఆర్ ఎస్, ఇటు సినీ ఇండస్ట్రీ కూడా కారాలు మిరియాలు నూరడమే కాదు…కొండా సురేఖ సంగతి తేల్చేందుకు ఏకంగా కొర్టుల్లోనూ కేసులు వేశారు. ఆ కాంట్రవర్సీ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది కాంగ్రెస్. అయినా ఆమె మీద యాక్షన్ తీసుకోకపోవడంపై రచ్చ జరుగుతూనే ఉంది. ఇంతలోనే మరో ఇష్యూతో పార్టీని రచ్చకీడ్చిశారు.
అగ్నికి ఆజ్యం
వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న కొండా సురేఖ.. తన పాత నియోజకవర్గం పరకాలలో తరచూ తలదూరుస్తున్నారు. పరకాల నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన రేవూరి ప్రకాశ్రెడ్డిని కాదని.. మంత్రి డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అవుతున్నారట. తన అనుచరుల దూకుడుకు మద్దతుగా నిలుస్తూ అగ్నికి ఆజ్యం పోస్తున్నారు.
దసరా సందర్భంగా పెట్టిన ప్లెక్సీ విషయంలో జరిగిన గొడవ కాస్త..గీసుకొండ పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. మంత్రి హోదాలో ఉన్న కొండా సురేఖ స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి..సీఐ సీటులో కూర్చొని హల్చల్ చేశారు. తన అనుచరుల జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇలా సీఐ సీట్లు ఆమె కూర్చోవడం… సొంత పార్టీ ఎమ్మెల్యే రేవూరికి సవాల్ విసరడం వివాదాస్పదం అయ్యాయి
అప్పటికే కొండా సురేఖ మీద అంతర్గతంగా రగిలిపోతున్న వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు… ఈ ఇష్యూ తర్వాత బరస్ట్ అయ్యారు. తమ నియోజకవర్గాల్లో ఆమె పెత్తనం ఏంటంటూ ఒక్కోక్కరు సీరియస్ అవుతున్నారు. మొన్నటి ఇష్యూతో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి ఆగ్రహంతో ఉన్నారట. తన అనుచరులపై దాడులు చేయడమేంటని..మంత్రి తీరుతో ఇబ్బందులు వస్తున్నాయని పార్టీ ముఖ్యుల దగ్గర పంచాయితీ పెట్టారు.
జిల్లాలోని ఎమ్మెల్యేలంతా జట్టు
ఆమెను కంట్రోల్ చేయకపోతే.. పరిస్థితి చేయి దాటిపోతుందని స్పష్టం చేశారట. ఇదే అదనుగా రేవూరితో జిల్లాలోని ఎమ్మెల్యేలంతా జట్టు కట్టేశారు. సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షి దృష్టికి సురేఖ వ్యవహారాన్ని కలిసి కట్టుగా తీసుకెళ్లారు. అంతటితో ఆగకుండా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కలిసి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి కూడా వెళ్తున్నారు.
ఒక్క రేవూరి ప్రకాశ్ రెడ్డి మాత్రమే కాదు..వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, వరంగల్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ..కొండా సురేఖ తీరుపై గుర్రుగా ఉన్నారు. ఆమెను ఎలాగైనా మంత్రి పదవి నుండి దింపేయాల్సిందేననే పట్టుదలతో వీళ్లంతా అధిష్టానంకు ఫిర్యాదు చేసేందుకు కూడా రెడీ అయిపోయారు. పార్టీ ముఖ్యనేతలు కూడా కొండా సురేఖ విషయంలో సీరియస్గానే ఫోకస్ చేశారట. ఆమెను ఎలా కంట్రోల్ చేయాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నారట. బీసీ నేత అందులోనూ.. మహిళ కావడంతో విషయం కాస్త సెన్సిటీవ్గా మారిందట. కానీ ఆమెను కట్టడి చేయకపోతే మునుముందు మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవని భావిస్తున్నారట.
ఎమ్మెల్యేల ఫిర్యాదుతో మరోసారి కార్నర్
ఇప్పటికే ఆమెపై కోర్టు దావాలు కొనసాగుతుండగా..సొంత జిల్లాలో, సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫిర్యాదుతో మరోసారి కార్నర్ అయిపోయారు కొండా సురేఖ. ఇప్పటికే అధిష్టానం ఆమె మీద సీరియస్గా ఉండటం..ఇప్పుడు ఎమ్మెల్యేల ఫిర్యాదుతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. రాష్ట్ర ముఖ్యనేతలు కూడా ఆమె తలనొప్పిగా మారారని..ఎంత చెప్పినా వినట్లేదని..తాము చేసేదేం లేదన్నట్లుగా చెప్పుకొస్తున్నారట.
అయితే వరుస వివాదాలతో కొండంత భారమైన సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించేందుకే ఈ వ్యవహారం జరుగుతోందన్న టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యేలను ఒకే తాటి మీదకు తేవడం..ఏకంగా ఢిల్లీకి పంపిస్తుండటం కూడా ప్లాన్లో భాగమేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖాముఖి కూర్చోబెట్టి సమస్యను సాల్వ్ చేయాల్సింది బోయి.. హస్తినకు షిఫ్ట్ చేయడం అంటేనే ఏదో జరుగుతుందని చర్చించుకుంటున్నారట కొండా సురేఖ అనుచరులు. ఈ పంచాయతీకి కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి ముగింపు ఇస్తుందోననే ఆసక్తి మాత్రం సర్వత్రా నెలకొంది.