ఏపీ పాలిటిక్స్‌నే మలుపుతిప్పిన కేసులో ఈడీ చెప్పిందేంటి?

చంద్రబాబు అరెస్ట్ వల్లే ఘోరఓటమి చవిచూడాల్సి వచ్చిందని ఫ్యాన్ పార్టీ లీడర్లే ఒప్పుకుంటారు.

ఏపీ పాలిటిక్స్‌నే మలుపుతిప్పిన కేసులో ఈడీ చెప్పిందేంటి?

Cm Chandrababu Naidu

Updated On : October 16, 2024 / 9:15 PM IST

నిజం ఇవాళ కాకపోతే రేపైనా బయట పడుతోంది. కానీ అప్పటిలోపు అబద్దం ఊరంతా చుట్టి వస్తుంది. ఏపీ స్కిల్ స్కాం కేసులో ఇదే జరిగింది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు స్కిల్ స్కీమ్లో నిధులు మళ్లించారని ఆరోపించింది గత వైసీపీ సర్కార్. అదే అంశంపై ఆయనను సీఐడీ అరెస్ట్ చేసి..చంద్రబాబు జైలుకు కూడా పంపారు. ఆ తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు మారిపోయి..వైసీపీ గద్దె దిగాల్సి వచ్చింది.

ఇప్పుడు మరోసారి స్కిల్ స్కాం కేసు తెరమీదకు వచ్చింది. స్కిల్ కేసులో నిధుల మళ్లింపులో చంద్రబాబుకు, అప్పటి ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదని ఈడీ క్లారిటీ ఇచ్చింది. ఈ కేసులో కొన్ని సంస్థల ఆస్తుల్ని జప్తు చేస్తూ ప్రెస్నోట్ వచ్చింది. అందులో ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్ని ఏపీలో స్కిల్ సేవలు అందించిన కంపెనీలు, షెల్ కంపెనీలకు మళ్లించారని ఆస్తులు జప్తు చేశారు. ఆ షెల్ కంపెనీల్లో చంద్రబాబువి కానీ.. టీడీపీకి సంబంధించిన వారివి కానీ లేవని ఈడీ స్పష్టం చేసింది.

డబ్బులు అందినట్లుగా ఎక్కడా చూపించలేదు..
వినాయక్ ఖాన్వెల్కర్, సుమన్ బోస్ సహ పలువురు బోగస్ ఇన్వాయిస్లు క్రియేట్ చేసి అక్రమాలు చేశారని గుర్తించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా ఈడీ తన స్టేట్మెంట్లో మెన్షన్ చేయలేదు. మొత్తం వ్యవహారంలో చంద్రబాబుకు కానీ ఆయనకు సంబంధించిన వారికి డబ్బులు అందినట్లుగా ఎక్కడా చూపించలేదు. దీంతో చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చినట్లుగా టీడీపీ నేతలు చెప్తున్నారు.

స్కిల్ కేసులో చంద్రబాబు పేరును రాత్రికి రాత్రి చేర్చి అర్ధరాత్రి కర్నూలులో అరెస్టు చేసింది వైసీపీ సర్కార్. నిధుల దుర్వినియోగం జరిగిందో..అవినీతి జరిగిందో వాళ్లకే అర్థం కానట్లుగా కేసు కట్టారు. సీఐడీ చీఫ్ సంజయ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి చంద్రబాబుకు ఈడీ నోటీసులు ఇచ్చినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారని..అవి చంద్రబాబువేనని చెప్పారు.

కానీ విచారణలో ఒక్క కంపెనీని చూపించలేకపోయారు. చంద్రబాబుకు ఒక్క రూపాయి చేరినట్లుగా నిరూపించ లేకపోయారు. ఈ కారణంగా ఆధారాల్లేవని హైకోర్టు అప్పుడు బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు ఆయన ఇన్వాల్మెంట్ లేదని ఈడీ చెప్పకనే చెప్పింది.

రాజమండ్రి సెంట్రల్ జైలులో 52 రోజులు..
గత ఏడాది సెప్టెంబర్లో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో నాటి ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబును నంద్యాలలో పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించారు. ఈ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. దాంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలులో 52 రోజులు ఉన్నారు.

ఆ తర్వాత బెయిల్పై రిలీజ్ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో పొలిటికల్ సిచ్యువేషన్ మారిపోయింది. సరిగ్గా ఎన్నికలకు ముందు ఏ తప్పైతే చేయొద్దో అదే మిస్టేక్ చేసి..ప్రజల ఆగ్రహానికి గురైంది వైసీపీ పార్టీ. చంద్రబాబు అక్రమ అరెస్ట్ను వ్యతిరేకిస్తూ వేలాది మంది రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేశారు. బాబు అరెస్ట్తర్వాత నారా భువనేశ్వరి ఇల్లు వదిలి ప్రజల మధ్యకు వచ్చారు. నిజం గెలవాలి పేరుతో జనాల్లోకి వెళ్లారు.

చంద్రబాబు అరెస్ట్ వల్లే ఘోరఓటమి చవిచూడాల్సి వచ్చిందని ఫ్యాన్ పార్టీ లీడర్లే ఒప్పుకుంటారు కూడా. ఆ వయస్సులో బాబును జైలులో పెట్టడం ఏపీ ప్రజలు జీర్ణించుకోలేకపోయారన్నది వాస్తవం. దేశ విదేశాల్లో ఆయన అరెస్ట్కు వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తాయి. ఇప్పుడు ఈడీ క్లారిటీతో బాబు మీద చేసిన ఆరోపణలన్నీ ఉట్టివేనని తెలిపోయాయంటున్నారు టీడీపీ నేతలు.

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, ఒకేసారి 6 పాలసీలు- సీఎం చంద్రబాబు