పీపీఈ కిట్ ధరించి కరోనా రోగులతో మాట్లాడిన కేటీఆర్

  • Published By: madhu ,Published On : August 18, 2020 / 01:16 PM IST
పీపీఈ కిట్ ధరించి కరోనా రోగులతో మాట్లాడిన కేటీఆర్

Updated On : August 18, 2020 / 1:56 PM IST

ఎవరూ చేయని ధైర్యం చేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి చేరుకున్న మంత్రి…పీపీఈ కిట్ ధరించి కరోనా బాధితులను పరామర్శించి విమర్శలు చేస్తున్న వారి నోళ్లు మూయించారు. రోగులకు ధైర్యం చెప్పారు.



ఆసుపత్రిలో 150 పడకలను ఏర్పాటు చేస్తామని, ఆక్సిజన్, వెంటిలెటర్ల సౌకర్యం కల్పించాలని అధికారులకు సూచించారు. కరోనా చికిత్స కోసం కేఎంసీ సూపర్ స్పెషాల్టీ త్వరగా ప్రారంభిస్తామన్నారు. ఈ సందర్భంగా కొంతమంది రోగులు కేటీఆర్ తో సెల్ఫీ దిగారు.

2020, ఆగస్టు 18వ తేదీ మంగళవారం ఉదయం వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చారు మంత్రి కేటీఆర్. ఆయన పర్యటన ఆసక్తికరంగా ఉంటోంది. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆయన వరంగల్ జిల్లాకు వచ్చారు.



భారీ వర్షానికి జిల్లా అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఎంజీఎం ఆసుపత్రికి పీపీఈ కిట్ ధరించి వచ్చిన మంత్రి కేటీఆర్ ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆయనతో పాటు మంత్రి ఈటెల, ఎర్రబెల్లి కూడ ఉన్నారు.

ఆసుపత్రిలో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కరోనా రోగులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని సూచించారు. వైరస్ కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు. రోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఎంజీఎం అనేక విమర్శలకు పాలవుతోంది. ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు అందడం లేదనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ చేసిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.