ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం

హైదరాబాద్ సహా ఇతర పట్టణ ప్రాంతాల పరిధిలోని ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం

Updated On : June 7, 2025 / 9:23 AM IST

Indiramma illu: హైదరాబాద్ సహా ఇతర పట్టణ ప్రాంతాల పరిధిలోని ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటి స్థలంలేని అర్హులకు ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం తొలుత జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే 16 ప్రాంతాల్లో స్థలాలను గుర్తించారు. నగరంలో నివసిస్తున్న, సొంత జాగా లేని అర్హులకు జీ ప్లస్ 3 ఫ్లోర్లతో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వనున్నారు. ఈ విషయంపై హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

 

జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్ల నుంచి ఇందిరమ్మ హౌసింగ్ స్కీం కోసం దాదాపు 10.71లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. అధికారుల పరిశీలన అనంతరం దాదాపు ఏడు లక్షల మంది ఇందిరమ్మ ఇళ్లకు అర్హులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. వీరిలో కొందరికి మాత్రమే సొంత స్థలాలు ఉన్నాయి. అధిక శాతం మందికి ఇంటి స్థలాలు లేకపోవటంతో ప్రభుత్వమే ఇంటి నిర్మాణం చేసి ఇవ్వాల్సిన పరిస్థితి. ఈ విషయంపై మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. పట్టణాల్లోని స్లమ్ ఏరియాల్లో నివసిస్తున్న ప్రజలు, అక్కడే ఉంటామని, దూరంగా ఇండ్లు ఇస్తే తమ ఉపాధి ఇబ్బంది అవుతుందని భావిస్తున్నందన ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

 

గతంలో హైదరాబాద్ కు దూరంగా 42వేల ఇండ్లను నిర్మించగా 19వేల మంది మాత్రమే అక్కడికి వెళ్లారని, ఇటీవల క్షేత్ర స్థాయిలో పరిశీలించగా.. కేవలం 13వేల మంది మాత్రమే అక్కడి ఇండ్లలో ఉంటున్నట్లు తేలిందని మంత్రి తెలిపారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని పట్టణ ప్రాంతాల్లో ప్రధానంగా హైదరాబాద్ మహానగరంలోని మురికి వాడల్లో పేదలు ఉన్నచోటే జీ ప్లస్3 పద్దతిలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం తొలి విడతలో హైదరాబాద్ లో 16 మురికివాడలను గుర్తించామని చెప్పారు.

హైదరాబాద్ మహానగరంలోనేకాక.. వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, కరీంనగర్ తదితర పట్టణాల్లో కూడా ఇదే విధానాన్ని అమలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు.