vakiti srihari : తెలంగాణలోని విద్యార్థులకు గుడ్న్యూస్.. మధ్యాహ్న భోజన పథకం మెనూలో చేపల కూర.. అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చిన మంత్రి
vakiti srihari : రాష్ట్రంలోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపలు అందించనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు.
Minister Vakati Srihari
- మధ్యాహ్న భోజన పథకం మెనూలో చేపల కూర
- త్వరలో అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు
- అసెంబ్లీ వేదికగా ప్రకటించిన మంత్రి వాకిటి శ్రీహరి
vakiti srihari : రాష్ట్రంలోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూలో చేపల కూర అందించనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. గురువారం అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో బలమైన పశుసంపద ఉందని, గుడ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నామని చెప్పారు. రైతుల ఇంటి వద్దకే సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి చెప్పారు.
మధ్యాహ్నం భోజన పథకంలో విద్యార్థులకు చేపల కూరను వడ్డించేందుకు కేబినెట్లో చర్చించినట్లు తెలిపారు. అయితే, చేపల కూర తినే సమయంలో విద్యార్థులకు చేప ముళ్లు వల్ల ఇబ్బందులు తలెత్తకుండా.. ముళ్లు తక్కువగా ఉండే తిలాపీ అనే చేపను ఈసారి ప్రత్యేకంగా పెంచి, పిల్లలకు పౌష్టికాహారానికి బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేస్తామని మంత్రి తెలిపారు. ఈ తిలాపీ చేపలో కేవలం మధ్యభాగంలో మాత్రమే పెద్ద ముళ్లు ఉంటుందని, తద్వారా విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉటుందని మంత్రి పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనుంది. అంతేకాక.. పాఠశాలల్లో, ఇంటర్ కాలేజీల్లో ఉదయం టిఫిన్ అందించేందుకు చర్యలు చేపట్టింది. అయితే, తాజాగా.. మధ్యాహ్న భోజన పథకం మెనూలో చేపల కూరను చేర్చుతామని మంత్రి వాకిటి శ్రీహరి అసెంబ్లీలో చెప్పారు. అయితే, వారంలో ఒకరోజు చేపల కూరను మెనూలో చేర్చుతారా.. వారంలో రెండు మూడు రోజులు చేపల కూరను విద్యార్థులకు అందిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
