Danam Nagender : ముందు పాతబస్తీ నుంచి మొదలు పెట్టాలి- హైడ్రా కూల్చివేతలపై మరోసారి దానం నాగేందర్ సీరియస్
అలాంటి వాళ్లని ఇబ్బంది పెడితే, అలాంటి వారి శాపనార్ధాలు మనకు మంచిది కాదు.

Danam Nagender : హైదరాబాద్ లో కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే దానం నాగేందర్. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం సరికాదన్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్ ల వాళ్లే సెట్ బ్యాక్ స్థలాలను పార్కింగ్ కు వాడుకుంటున్నారని, జీవనాధారం కోసం ఫుట్ పాత్ పై చిన్న షాప్ పెట్టుకుంటే కూల్చేయడం సరికాదన్నారు దానం నాగేందర్.
అలా సిటీ మొత్తం కూల్చాల్సి వస్తే ముందు పాతబస్తీ నుంచి మొదలు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చే పాలసీలను తాను తప్పుపట్టడం లేదన్న దానం.. కొందరు అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చింతల్ బస్తీలో కూల్చివేతల విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు దానం నాగేందర్.
Also Read : దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల సునామీ.. 3 రోజుల్లోనే 1.32 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఒప్పందాలు
”కూల్చివేతల విషయంలో ఏకపక్షంగా వెళ్లకూడదు. రోజువారీ వ్యాపారం చేసుకునే వారిని టార్గెట్ చేస్తున్నారు. వారి జీవనాధారం అదే. ఆ రోజు వ్యాపారం చేసుకుంటేనే వారి పొట్ట నిండుతుంది. అలాంటి వాళ్లని ఇబ్బంది పెడితే, అలాంటి వారి శాపనార్ధాలు మనకు మంచిది కాదు. ఇరుకైన రోడ్లలో అధికారులు అలా చేయాలి. అయితే, అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు అనేది నా అభిప్రాయం” అని దానం నాగేందర్ అన్నారు.
తన నియోజకవర్గం పరిధిలోకి వచ్చే చింతల్ బస్తీలో కూల్చివేతలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సీరియస్ గా ఉన్నారు. నిన్న షాదాన్ కాలేజీ ఎదురుగా జరుగుతున్న కూల్చివేతలను ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. నా పర్మిషన్ లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై ఆయన మండిపడ్డారు. ఎక్కడి నుంచి బతకానికి వచ్చినోళ్లు మాపై దౌర్జన్యం చేస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
దావోస్ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి తిరిగి వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలన్నారు. లేదంటే ఆందోళన చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారాయన. కూల్చివేతల విషయంలో అధికారుల తీరుపై దానం నాగేందర్ చాలా సీరియస్ గా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉన్నాయని అభిప్రాయం పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది.
Also Read : ఇందిరమ్మ ఇంటి కోసం అప్లై చేశారా? మీకు వచ్చిందో లేదో ఇక్కడ డైరెక్ట్ గా చెక్ చేసుకోండి..