Komatireddy Raj Gopal Reddy: నిధుల కోసం ప్రాధేయపడాల్సి వస్తోంది- మరోసారి సీఎం రేవంత్ పై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్
నన్ను ఎన్నుకున్న ప్రజలకు నేను ఏం చెప్పాలి? మాట్లాడటం నాకు చేతకాదా? నేను ప్రలోభాలకు లొంగే వ్యక్తినా? ఎవరైనా బెదిరిస్తే భయపడే వ్యక్తినా?
Komatireddy Raj Gopal Reddy: కొంత కాలంగా సీఎం రేవంత్ టార్గెట్ గా చెలరేగిపోతున్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. చాన్స్ చిక్కితే చాలు సీఎం రేవంత్ పై మాటల యుద్ధానికి దిగుతున్నారు. సీఎం రేవంత్ ను గట్టిగానే నిలదీస్తున్నారాయన. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి సీఎం రేవంత్ టార్గెట్ గా హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.
ఎమ్మెల్యేలకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. మంత్రుల నియోజకవర్గాలకు మాత్రమే నిధులు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎం, మంత్రుల నియోజకవర్గాల్లో మాత్రమే పనులు జరుగుతున్నాయని ఆయన వాపోయారు. నిధుల కోసం, బిల్లుల కోసం సీఎం, మంత్రులను ప్రాధేయపడాల్సి వస్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు ఈ పదవిలో ఉండేందుకు నేను అర్హుడిని కాను అని అన్నారు. రెండున్నరేళ్లుగా తాను ఎంతో బాధ పడుతున్నానని తెలిపారు. ప్రాంతాలు, నియోజకవర్గాల మీద దయచేసి వివక్ష చూపొద్దని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. అందరినీ సమానంగా చూడాలని, అన్ని నియోజకవర్గాల మీద శ్రద్ధ పెట్టి అభివృద్ధికి నిధులు ఇచ్చి, పనులు ఆగకుండా చేయాలని ప్రభుత్వానికి రిక్వెస్ట చేశారు రాజగోపాల్ రెడ్డి.
”ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే ఎమ్మెల్యేగా మాట్లాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈ ప్రాంతంలో ప్రాజెక్టుల పేరు మీద వివక్ష జరుగుతోంది. నార్త్ తెలంగాణ, సౌత్ తెలంగాణ, మహబూబ్ నగర్, నల్గొండ అని చెప్పి మాట్లాడటం కరెక్ట్ కాదు. దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉంది. ఇంత సమస్య ప్రపంచంలో మరెక్కడా లేదు. తాగు నీరు, సాగు నీరు అంతా ఫ్లోరైడ్. అటు నియోజకవర్గం కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతోంది. అభివృద్ధికి నోచుకోవడం లేదు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా శ్రద్ధ చూపి ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తారని కోరుతున్నా.
ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఏం వచ్చినా అక్కడికే పోతున్నాయని టాక్. నన్ను గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. కొడంగల్ ప్రజలు గెలిపిస్తే నేను ముఖ్యమంత్రి అయ్యా అని రేవంత్ రెడ్డి పదే పదే చెబుతారు. రాష్ట్రానికి సీఎం అయినా.. కొడంగల్ అభివృద్ధి బాధ్యత అని రేవంత్ చెబుతారు. మరి ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములన్నీ హుజూర్ నగర్ కే వెళ్తున్నాయి. మాకు మాత్రం లిఫ్ట్ లేదు, కాలువ లేదు, రిజర్వాయర్ లేదు, చెరువు లేదు, కుంట కూడా లేదు.
ఈ పదవిలో ఉండేందుకు నేను అనర్హుడిని..
నన్ను ఎన్నుకున్న ప్రజలకు నేను ఏం చెప్పాలి? మాట్లాడటం నాకు చేతకాదా? నేను ప్రలోభాలకు లొంగే వ్యక్తినా? ఎవరైనా బెదిరిస్తే భయపడే వ్యక్తినా? మా ప్రభుత్వం ఉండి కూడా నా నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుంటే నేను మాట్లాడకుండా ఉండాలా? నా ప్రాంత ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు ఈ పదవిలో ఉండేందుకు నేను అర్హుడిని కాను. రెండున్నరేళ్లుగా నేను బాధ పడుతున్నా. ప్రాంతాలు, నియోజకవర్గాల మీద దయచేసి వివక్ష చూపొద్దు. అందరినీ సమానంగా చూడండి. అన్ని నియోజకవర్గాల మీద శ్రద్ధ పెట్టి అభివృద్ధికి నిధులు ఇచ్చి, పనులు ఆగకుండా చేయండి” అని రిక్వెస్ట్ చేశారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.
