Mla Sanjay Kumar : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై స్పీకర్ కు ఫిర్యాదు..

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ను ఉద్దేశించి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

Mla Sanjay Kumar : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై స్పీకర్ కు ఫిర్యాదు..

Updated On : January 13, 2025 / 5:06 PM IST

Mla Sanjay Kumar : హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన అధికారిక సమావేశంలో తనపై దాడికి పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే అడ్డుకున్నారని తెలిపారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సంజయ్ కోరారు. దీనికి స్పందించిన స్పీకర్ ప్రసాద్ కుమార్ నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం.

ఎమ్మెల్యే సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట..
కరీంనగర్ కలెక్టరేట్ లో అభివృద్ధి కార్యక్రమాల సన్నద్ధతపై నిన్న నిర్వహించిన సమీక్ష సమావేశం రసాభాసగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ను ఉద్దేశించి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నువ్వు ఏ పార్టీ ఎమ్మెల్యే అంటూ సంజయ్ ను ప్రశ్నించారు పాడి కౌశిక్ రెడ్డి. తాను కాంగ్రెస్ పార్టీ అని సంజయ్ చెప్పడంతో పాడి కౌశిక్ రెడ్డి మరింత రెచ్చిపోయారు. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ తరఫున మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.

Also Read : కలెక్టరేట్ ఘటన.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదు

నీది ఏ పార్టీ అంటూ? రెచ్చిపోయిన కౌశిక్ రెడ్డి..
దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేసి గెలవాలని సంజయ్ కు సవాల్ విసిరారు పాడి కౌశిక్ రెడ్డి. ఈ క్రమంలో వేదికపైనే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరువురి నడుమ తోపులాట కూడా చోటు చేసుకుంది. పాడి కౌశిక్ రెడ్డి తీరుతో అక్కడే ఉన్న మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు షాక్ తిన్నారు. ఇంతలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. గొడవ మరింత పెద్దది కాకుండా పాడి కౌశిక్ రెడ్డిని బలవంతంగా బయటకు తీసుకెళ్లిపోయారు.

అసెంబ్లీ స్పీకర్ కు సంజయ్ కుమార్ ఫిర్యాదు..
ఇద్దరు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్ మధ్య వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్.. ఇవాళ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిశారు. పాడి కౌశిక్ రెడ్డి తనపై దాడి చేసే ప్రయత్నం చేశారంటూ సంజయ్ కుమార్ అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.

అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరుగుతున్న సమయంలో పాడి కౌశిక్ రెడ్డి జోక్యం చేసుకుని సంజయ్ కుమార్ పై మాటల దాడి చేసే ప్రయత్నం చేశారు. ఏ పార్టీ నుంచి గెలిచారు? ఏ పార్టీలోకి వెళ్లారు? అంటూ కౌశిక్ రెడ్డి ప్రశ్నించడంతో వాగ్వాదం మొదలైంది. ఆ తర్వాత తోపులాట జరిగింది. ఓ శాసనసభ సభ్యుడిగా తనకున్న హక్కులకు భంగం కలిగించే విధంగా పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Also Read : సంజయ్‌పై కౌశిక్ రెడ్డి ఆగ్రహానికి కారణం అదే.. గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు