Padi Kaushik Reddy: కలెక్టరేట్ ఘటన.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదు
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద మూడు కేసులు నమోదయ్యాయి. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో ...

BRS MLA Padi Kaushik Reddy
Padi Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద మూడు కేసులు నమోదయ్యాయి. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో అభివృద్ధి కార్యక్రమాల సన్నద్ధతపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అయితే, ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతున్న సమయంలో హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాగ్వివాదానికి దిగాడు. నువ్వు ఏ పార్టీ ఎమ్మెల్యేవి చెప్పాలంటూ సంజయ్ కుమార్ ను ప్రశ్నించాడు. ఈ క్రమంలో వారి మధ్య మాటామాటా పెరిగి తోపులాట చోటు చేసుకుంది.
ఇద్దరి మధ్య వివాదం ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు అప్రమత్తమై కౌశిక్ రెడ్డిని కలెక్టరేట్ సమావేశం హాల్ నుంచి బయటకు తీసుకెళ్లారు. అయితే, కౌశిక్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా సమస్యలు పరిష్కరించేందుకు నిర్వహించిన సమావేశంలో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా కౌశిక్ రెడ్డి రాజకీయం చేయడం సరైంది కాదంటూ పేర్కొన్నారు. ఇదిలాఉంటే కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మూడేళ్ల తరువాత కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, ఇవాళ ఎవరైతే ఓవరాక్షన్ చేశారో ఆ అధికారులను వదిలేది లేదంటూ హెచ్చరించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను బయట తిరగనివ్వమని, అడుగడుగునా అడ్డుకుంటామంటూ కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
కౌశిక్ రెడ్డి తీరుపై ఎమ్మెల్యే సంజయ్ సైతం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సమావేశంలో గందరగోళం సృష్టించడంతోపాటు, సమావేశంను పక్కదారి పట్టించారని ఆర్డీవో మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. తాజాగా గ్రంథాలయ చైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తన పట్ల కౌశిక్ రెడ్డి దురుసుగా ప్రవర్తించాడని మల్లేశ్ ఫిర్యాదు చేశారు. దీంతో కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో నాలుగు సెక్షన్ల కింద ఒక్కో కేసు నమోదు కాగా.. మొత్తంగా 12 సెక్షన్ల కింద మూడు కేసులు నమోదయ్యాయి.