Ponguleti Srinivas Reddy : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే..
హనుమకొండ నుంచి ఖమ్మం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

Ponguleti Srinivas Reddy : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు టైర్లు ఒక్కసారిగా పేలాయి. ఒకేసారి రెండు టైర్లు పేలడంలో వాహనం అదుపుతప్పింది. డ్రైవర్ చాక్యచక్యంగా వ్యవహరించడంతో మంత్రికి ముప్పు తప్పింది. హనుమకొండ నుంచి ఖమ్మం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
ఒకేసారి పేలిపోయిన రెండు టైర్లు..
రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హన్మకొండలోను, వరంగల్ లోనూ సమీక్ష సమావేశాలు ముగించుకుని తిరిగి వస్తుండగా.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం సమీపంలో మంత్రి ప్రయాణిస్తున్న కారు (ల్యాండ్ క్రూజర్) రెండు టైర్లు ఒకేసారి పేలిపోయాయి. ఆ సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించాడు. అతి వేగంగా ఉన్నప్పటికీ.. కారుని కంట్రోల్ చేయగలిగాడు. దాంతో మంత్రికి పెను ప్రమాదం తప్పినట్లైంది. వెంటనే సెక్యూరిటీ వాహనంలో మంత్రి పొంగులేటి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అందరినీ షాక్ కి గురి చేసిన ఘటన..
జనవరి 26వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన భూ భారతి, ఇందిరమ్మ ఇళ్ల స్థలాల ప్రారంభోత్సవంతో పాటు అనేక సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశాలు నిర్వహించారు. వాటిని ముగించుకుని వస్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే, మంత్రికి ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో పొంగులేటి కుటుంబసభ్యులు, ఆయన అభిమానులు, కాంగ్రెస్ నాయకులు ఊపిరిపీల్చుకున్నారు. ఒకేసారి కారు రెండు టైర్లు పేలడం అందరినీ షాక్ కి గురి చేసిందనే చెప్పాలి.
ఒకేసారి రెండు టైర్లు పేలిపోవడంపై అనుమానాలు, సందేహాలు..
ఒకేసారి రెండు టైర్లు పేలడం డిస్కషన్ కు దారితీసింది. దీనిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టైర్లు అరిగిపోయాయా? లేక రోడ్డు మీద వస్తున్న క్రమంలో పంక్చర్ అయ్యాయా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటన జరిగిన సమయంలో మంత్రి పొంగులేటితో పాటు భద్రాచలం ఎమ్మెల్మే తెల్లం వెంకట్రావు, డీసీసీబీ డైరెక్టర్లు బ్రహ్మయ్య, బుర్రా రాజశేఖర్ కూడా ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. గాయాలు కూడా కాకుండా సురక్షితంగా ఉన్నారు.
వరదలతో దెబ్బతిన్న రోడ్డు..
ఈ ఘటన అనంతరం.. మంత్రి పొంగులేటి.. సెక్యూరిటీకి సంబంధించిన వెహికల్ లో తన క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయారు. మొత్తంగా చూసుకుంటే.. ల్యాండ్ క్రూజర్ టైర్లు అరుగుదల వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని చెబుతున్నారు. అటు వరంగల్ టు హన్మకొండ నుంచి తిరుమలాయపాలెం రోడ్డు.. ఇటీవలి కాలంలో వచ్చిన వరదలతో గుంతలు పడింది. ఆ గుంత వల్ల ఈ ఘటన జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట.. ఏకంగా మంత్రుల ముందే..