మాట్లాడడానికి వస్తే కాల్పులు జరుపుతారా? సహించం.. తీన్మార్‌ మల్లన్నను అరెస్టు చేయకపోయారో..: కవిత

మల్లన్న చేసిన కామెంట్లపై మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశానని తెలిపారు.

మాట్లాడడానికి వస్తే కాల్పులు జరుపుతారా? సహించం.. తీన్మార్‌ మల్లన్నను అరెస్టు చేయకపోయారో..: కవిత

Updated On : July 13, 2025 / 4:43 PM IST

ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నను అరెస్టు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేసిన తర్వాత కవిత మీడియాతో మాట్లాడారు.

తీన్మార్‌ మల్లన్నను అరెస్టు చేయకపోతే సీఎం రేవంత్‌ రెడ్డిని కూడా అనుమానించాల్సి వస్తుందని కవిత అన్నారు. ప్రజాస్వామ్యంగా మాట్లాడడానికి వస్తే కాల్పులు జరుపుతారా? అని అన్నారు. ఒక మహిళ ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారని చెప్పారు.

తీన్మార్‌ మల్లన్న ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించబోమని కవిత తెలిపారు. ఆయనను ఒక్కసారి కూడా విమర్శించలేదని చెప్పారు. తెలంగాణ మహిళలకు ప్రత్యేక గౌరవం ఉంటుందన్నారు. మల్లన్న చేసిన కామెంట్లపై మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశానని తెలిపారు.

“అసలు ఆయన ఎవరు? నేనేమీ అనకముందే ఆయన నాపై కామెంట్స్‌ చేస్తున్నారు. అసలు నాపై ఎందుకు కామెంట్ చేయాలి? ఆయన అడగాల్సింది ప్రభుత్వాన్ని? సర్కారుని అడగకుండా నన్ను అడ్డుకుంటానని అంటున్నారు. ఇవాళ చూశారు కదా ఏం జరిగిందో.. ఆయన ఎవరో ఆయన సంగతి ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు. నేనెవరో నా సంగతి ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు.

ఆయన ఒక ఎమ్మెల్సీ.. నేను ఇంకొక ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ.. నన్ను ఆయన ఇంత మాట అంటే కూడా ప్రభుత్వం రెస్పాండ్ కావట్లేదు. కాబట్టి ఇవాళ నేను ఇక్కడ కంప్లైంట్ చేయడానికి వచ్చాను. ఎందుకంటే ఆడబిడ్డలు రాజకీయాల్లోకి రావాలని కోరుకునే వ్యక్తిని నేను. ఇట్లాంటి వాళ్లని చూస్తే ఆడవాళ్లు రాజకీయాల్లో వస్తారా? ఇంట్లో వాళ్లు రానిస్తారా? అసలు ఇట్లాంటి వాళ్లని చూసి నాకే సిగ్గు అవుతుంది” అని చెప్పారు.

లా అండ్ ఆర్డర్ ఐజీ రమణ కుమార్‌కు కూడా కవిత ఫిర్యాదు చేశారు. తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకే గన్‌మన్‌ ఫైరింగ్ చేశారని తెలిపారు. తీన్మార్ మల్లన్నపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, వెంటనే అరెస్టు చేయాలని ఫిర్యాదు చేశానని కవిత అన్నారు.

Also Read: పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేశారు.. త్వరలో రాజకీయ పార్టీ పెడతా: తీన్మార్‌ మల్లన్న