పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేశారు.. త్వరలో రాజకీయ పార్టీ పెడతా: తీన్మార్‌ మల్లన్న

"నన్ను కాపాడేందుకు గన్‌మన్ ఫైర్ చేశాడు. దాడి నాపై చేసి కల్వకుంట్ల కవిత డీజీపీకి ఫిర్యాదు చేయడం ఏంటో.." అని అన్నారు.

పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేశారు.. త్వరలో రాజకీయ పార్టీ పెడతా: తీన్మార్‌ మల్లన్న

Updated On : July 13, 2025 / 4:02 PM IST

తనపై హత్యాయత్నం జరిగిందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. హైదరాబాద్‌ మేడిపల్లిలోని తన కార్యాలయంపై దాడి జరిగిన ఘటనపై 10టీవీతో మాట్లాడారు. త్వరలో రాజకీయ పార్టీ పెడతానని.. బీసీలను ఏకం చేస్తానని చెప్పారు.

“నన్ను కాపాడేందుకు గన్‌మన్ ఫైర్ చేశాడు. దాడి నాపై చేసి కల్వకుంట్ల కవిత డీజీపీకి ఫిర్యాదు చేయడం ఏంటో.. పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేశారు. దాడికి ఉసిగొల్పిన కవిత శాసన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలి. త్వరలో రాజకీయ పార్టీ పెడతా.. బీసీలను ఏకం చేస్తా” అని అన్నారు.

“ఉదయం 11 గంటలకు నా కార్యాలయం మీద జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. కొందరు జాగృతి కార్యకర్తలు నా ఆఫిస్ కు వచ్చి నేను కూర్చున్న రూంలోకి వచ్చే ప్రయత్నం చేశారు. నా గన్‌మన్ వద్ద ఉన్న విపన్ తీసుకుని నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా నన్ను కాపాడేందుకు గన్‌మన్ గాల్లో కి ఫైర్ చేశాడు.

బీసీలు రాజకీయ వాటా కోర వద్దనే.. పార్టీ పెట్టొద్దనే కక్షతోనే నాపై ఎమ్మెల్సీ కవిత దాడి చేయించారు. 42% రిజర్వేషన్ కల్పిస్తే బీసీలను సంబరాలు కూడా చేసుకోనివ్వరా? గత ప్రభుత్వంలో రిజర్వేషన్ తగ్గించినప్పుడు కల్వకుంట్ల కవిత ఎక్కడికి పోయారు. కవితకు. బీసీలకు ఏంటి సంబంధం?

అమె ఎవరో సంబరాలు చేసుకోవడానికి? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేసింది. మా బీసీల కోసం మేము కొట్లాడుతుంటే కవితకి ఎందుకు బాధ? తెలంగాణలో బీసీలు ముఖ్యమంత్రి కావాలని తాము కోరుతున్నాము పోట్లాడుతున్నాము. కాగా, మేడిపల్లి పోలీసులకు తీన్మార్‌ మల్లన్న ఫిర్యాదు చేశారు. తనను చంపే కుట్రతోనే దాడి చేశారని ఆరోపించారు.

Also Read: ఆలస్యం అవుతుందా? జీతాల పెరుగుదల ఎప్పుడు? ఎంత పెరుగుతాయి? ఫుల్‌ డీటెయిల్స్‌..

తీన్మార్ మల్లన్న కార్యాలయానికి డీసీపీ పద్మజ చేరుకున్నారు. మల్కాజ్‌గిరి ఏసీపీ చక్రపాణి, మేడిపల్లి ఇన్‌స్పెక్టర్‌ గోవింద్ రెడ్డి కూడా అక్కడకు వచ్చారు. తీన్మార్ మల్లన్న కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటనాస్థలికి క్లూస్ టీమ్స్‌ చేరుకున్నాయి.

మల్లన్న కార్యాలయంపై దాడి వివరాలు తెలుసుకుని, ఆయనను పరామర్శించేందుకు భారత చైతన్య అధ్యక్షుడు బోడే రామచంద్రర్ అక్కడకు వెళ్లారు.