8th pay commission: ఆలస్యం అవుతుందా? జీతాల పెరుగుదల ఎప్పుడు? ఎంత పెరుగుతాయి? ఫుల్‌ డీటెయిల్స్‌..

ప్రతి 10 ఏళ్లకు ఒకసారి కేంద్రం ఈ కమిషన్‌ను ఏర్పాటు చేస్తుంది. 1946 నుంచి ఇప్పటివరకు ఏడింటిని ఏర్పాటు చేసింది.

8th pay commission: ఆలస్యం అవుతుందా? జీతాల పెరుగుదల ఎప్పుడు? ఎంత పెరుగుతాయి? ఫుల్‌ డీటెయిల్స్‌..

Updated On : July 13, 2025 / 3:13 PM IST

కేంద్ర ప్రభుత్వం 8వ పే కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, అలవెన్సులను (ద్రవ్యోల్బణానికి అనుగుణంగా డీఏతో పాటు) సవరిస్తారు. ఈ విషయంపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటన చేసినప్పటికీ నుంచి ఇది ఎప్పుడు అమలవుతుంది? ఎలాంటి లాభాలు ఉంటాయి? అన్న ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎలా ప్రభావితం చేస్తుందనే ఉత్కంఠ ఉంది.

అశ్వినీ వైష్ణవ్ చేసిన ప్రకటన ప్రకారం.. ఈ కమిషన్‌ను 2026 జనవరి నాటికి ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దాదాపు కోటి మంది ఉద్యోగులు, పెన్షనర్లు దీని కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో నేషనల్ కౌన్సిల్-జేసీఎం ఉద్యోగుల ప్రతినిధి శివ గోపాల్ మిశ్రా, టెర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ (ToR) త్వరలోనే ఆమోదం పొందుతుందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

అంబిత్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్‌ రిపోర్టు ప్రకారం.. ఇందుకు సంబంధించిన సిఫార్సులను 2025 చివరి నాటికి కేంద్రానికి అందుతాయి. అనుకున్నట్లు అన్నీ జరిగితే 2026 జనవరి నుంచి అమలవుతుంది. అయితే, నివేదిక పూర్తవడం, దాన్ని సమర్పించడం, దానికి ఆమోద ముద్ర వేసే ప్రక్రియపై ఇది ఆధారపడి ఉంటుంది.

Also Read : పీఎం కిసాన్ 20వ విడతపై ఉత్కంఠ.. రూ. 2వేలు పడే రైతుల జాబితా ఇదే.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి..!

ఆలస్యం అవుతుందా?
ప్రతిపాదనను సమర్పించడం, దాన్ని ఆమోదించే ప్రక్రియ జరిగే తీరు ప్రకారం.. దాని అమలు 2026 చివరికి లేదా 2027 జనవరికి వాయిదా పడే అవకాశం ఉందని ఎకనామిక్స్‌ టైమ్స్‌ పేర్కొంది. 7వ పే కమిషన్‌ను 2014 ఫిబ్రవరిలో ప్రకటించగా, ఇది 2016 జనవరి నుంచి అమలులోకి వచ్చింది.

ఎవరికి లాభం?
సుమారు 50 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, రక్షణ సిబ్బంది ఇందులో లబ్ధిదారులుగా ఉన్నారు. అదనంగా, 65 లక్షల మందికి పైగా పెన్షనర్లకు కూడా ప్రయోజనం చేకూరుతుంది.

జీతాల్లో ఎంత పెరుగుదల ఉంటుంది?
ప్రభుత్వం అధికారికంగా ఈ వివరాలు తెలియజేయలేదు. అయితే అంచనాల ప్రకారం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా కనీస జీతం రూ.18,000 నుండి రూ.51,480కి పెరిగే అవకాశం ఉంది.

అంబిత్‌ నివేదిక ప్రకారం.. జీతాలు, పెన్షన్లు సుమారు 30-34 శాతం పెరగనున్నాయి. ఇది 2025–26 ఆర్థిక ఏడాదికిగానూ కేంద్ర సర్కారు తీసుకున్న రూ.1 ట్రిలియన్ పన్ను తగ్గింపు నిర్ణయానికి అనుగుణంగా ఉంది. ఇది అమలులోకి వస్తే కేంద్రంపై ఖర్చుల భారం రూ.1.8 లక్షల కోట్లు పెరిగే అవకాశం ఉంది.

బేసిక్ పే ఎలా మారుతుంది?
గత 30 ఏళ్లలో పే కమీషన్లు గ్రేడ్ పే, పే బ్యాండ్స్, పే మ్యాట్రిక్స్ వంటి విధానాలతో ఈ ప్రక్రియను కొనసాగించాయి. 6వ సీపీసీకి ముందు 4,000కి పైగా వేర్వేరు పే స్కేల్స్ ఉండటం వల్ల గందరగోళం ఏర్పడేది. 6వ సీపీసీలో గ్రేడ్ పే, పే బ్యాండ్ తీసుకువచ్చి తర్వాత ఈ విధానం సరళంగా మారింది. 7వ సీపీసీలో మార్పులు వచ్చాయి.

పే మ్యాట్రిక్స్ ను 24 లెవెల్ టేబుల్ రూపంలో రూపొందించారు. 7వ సీపీసీలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉండేది. బేసిక్ పే అంటే ఉద్యోగ స్థాయి ఆధారంగా నిర్ణయించే స్థిరమైన భాగం. మొత్తం జీతంలో ఇది 51.5 శాతంగా ఉంటుంది.

డీఏ: ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించేందుకు అందుకు అనుగుణంగా డీఏ ఇస్తారు. దీన్ని సీపీఐ ఆధారంగా ప్రతి సంవత్సరం రెండుసార్లు సవరిస్తారు. ప్రస్తుత రేటు 50 శాతం అయితే, రూ.18,000 బేసిక్ పేకి రూ.9,000 డీఏగా కలుస్తుంది. డీఏ సుమారు 30.9 శాతం భాగంగా ఉంటుంది.

హెచ్‌ఆర్‌ఏ: నివాస ఖర్చులకు ఇస్తారు. ఇది సుమారు 15.4 శాతం.

టీఏ: ప్రయాణ ఖర్చుల కోసం ఇచ్చే స్థిర మొత్తము. ఇది సుమారు 2.2 శాతం.

డీఏపై ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ప్రభావం
7వ సీపీసీలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 అయినా, కొత్త కమిషన్ ప్రారంభంలో డీఏను జీరో చేయడం వల్ల వాస్తవ వేతన పెరుగుదల 14.3 శాతమే. 8వ సీపీసీలోనూ అదే విధంగా జరిగే అవకాశం ఉంది.

పే కమిషన్‌ పనితీరు
ప్రతి 10 ఏళ్లకు ఒకసారి కేంద్రం ఈ కమిషన్‌ను ఏర్పాటు చేస్తుంది. 1946 నుంచి ఇప్పటివరకు ఏడింటిని ఏర్పాటు చేశారు. ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యత్యాసాలు, బోనస్‌లు, అలవెన్సులు తదితర అంశాలపై సమీక్ష చేస్తుంది. ప్రస్తుతం అమలులో ఉన్నవి 2014లో ఏర్పడిన 7వ పే కమిషన్‌ సిఫార్సులు.