Azharuddin: అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అజారుద్దీన్ పోటీకి సై.. అంజ‌న్‌కుమార్ సలహాతో కంగుతిన్న అజ్జూ భాయ్!

Azharuddin: అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అజారుద్దీన్ పోటీకి సై.. అంజ‌న్‌కుమార్ సలహాతో కంగుతిన్న అజ్జూ భాయ్!

Azharuddin, Vishnuvardhan Reddy

Mohammad Azharuddin: టీం ఇండియా (Team India) మాజీ కెప్టెన్ అజారుద్దీన్ వచ్చే ఎన్నికల్లో పోటీ సస్పెన్స్‌గా మారింది. గతంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన అజ్జూ భాయ్ త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తిగా ఉన్నారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలో మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలను అన్వేషిస్తున్నారు. ఈ అన్వేషణలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై (Jubilee Hills Constituency) కన్నేసిన అజహర్‌కు స్థానిక కార్యకర్తల నుంచి నిరసన సెగ ఎదురైంది. గత రెండు ఎన్నికల్లో ఓటమి చవిచూసిన చోట పోటీ చేస్తామంటే స్థానిక కార్యకర్తలు ఎదురు తిరగడంపై అవాక్కయ్యారు అజహర్. ఇంతకీ అజహర్ జూబ్లీహిల్స్‌లో ఎందుకు పోటీ చేయాలని అనుకున్నారు? ఆయనకు వ్యతిరేకంగా కార్యకర్తలు ఎందుకు ఎదురుతిరిగారు?

కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూప్ త‌గాదాలు, వ‌ర్గపోరు.. ఇది మరోసారి రుజువైంది. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో రెండు వర్గాల మధ్య రేగిన పెద్ద దుమారం నగరంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వివాదంలో మాజీ క్రికెటర్.. కాంగ్రెస్ సీనియర్ నేత అజారుద్దీన్ అడ్డంగా బుక్కైపోవడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన అజారుద్దీన్ ఈసారి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయాలని కొంతకాలం ఆసక్తి చూపుతున్నారు. గతంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన అజ్జూ భాయ్.. తను పుట్టి పెరిగిన నగరంలో ప్రజా సేవ చేయాలని తెగ ఉవ్విళ్లూరుతున్నారు. ఆయన ఆసక్తిని గమనించిన కాంగ్రెస్ హైకమాండ్ కూడా గ్రేటర్‌లో మైనార్టీల ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై ఆరా తీసింది. ఓల్డ్ సిటీలోని ఎమ్‌ఐఎమ్ ప్రభావం ఉండే ఏడు అసెంబ్లీ సీట్లు కాకుండా మిగిలిన స్థానాల్లో ఎక్కడైనా పోటీకి అజహర్ రెడీ అనడంతో.. రాజేంద్రన‌గ‌ర్‌, స‌న‌త్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గాల‌పై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువ‌గా ఉండటం.. అక్కడైతే సులువుగా గెల‌వ‌చ్చని అజహర్ కూడా భావించి.. సరేనన్నారట.. కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది..

అంతా.. బాగుంది.. సిటీలో అజ్జూ భాయ్ పోటీ చేస్తే.. ఆ ప్రభావం మిగతా సీట్లపై పడి పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందని కాంగ్రెస్ పెద్దలు లెక్కలేసుకుంటున్న సమయంలో ఈ సీన్‌లోకి మరో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ అంజ‌న్‌కుమార్ యాద‌వ్‌ ఎంటర్ అయ్యార్. అజ్జూ భాయ్‌ని జూబ్లిహిల్స్‌లో పోటీ చేస్తే బాగుంటుందని ప్రతిపాదించారట. ఆ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలకు లక్షా 20 వేల ఓట్లు ఉన్నట్లు చెప్పడంతో అజహర్ దృష్టి జూబ్లీహిల్స్‌పైకి మళ్లింది. అంతేకాకుండా అంజన్‌కుమార్ కుమారుడు అనిల్‌కుమార్ యాదవ్ సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండటంతో తాము అండదండగా ఉంటామని అజహర్‌కు భరోసా ఇచ్చారట.. ఐతే ఇక్కడ రాజకీయాన్ని అర్థం చేసుకోలేని అజారుద్దీన్ నేరుగా క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధమై.. ప్రస్తుతం జూబ్లిహిల్స్ ఇన్‌చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్‌రెడ్డి అనుచరుల ఆగ్రహానికి గురయ్యారు.

Also Read: బీఆర్‌ఎస్‌లో వారసుల సందడి.. విశ్రాంతి తీసుకుంటామంటున్న సీనియర్లు.. కుదరదంటున్న కేసీఆర్

అంజన్‌కుమార్ యాదవ్ వర్గానికి.. మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్గానికి మధ్య తొలి నుంచి విభేదాలు ఉన్నాయి. అజహర్‌ను జూబ్లిహిల్స్‌కి తెచ్చి విష్ణుకు చెక్ చెప్పాలని భావించారు అంజన్. ఇది తెలియని అజారుద్దీన్ అంజ‌న్ అనుచరులైన కిర‌ణ్ యాద‌వ్‌, భ‌వానీ శంక‌ర్‌లతో కలిసి జూబ్లిహిల్స్ పరిధిలో కార్యకర్తలతో ఛాయ్ పే చ‌ర్చ ఏర్పాటు చేశారు. కార్మికన‌గ‌ర్‌లో కూడా ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఐతే ఈ విషయం స్థానిక నాయకుడైన మాజీ ఎమ్మెల్యే విష్ణుకు తెలియడం.. తనకు కనీస సమాచారం ఇవ్వకుండా.. తనకు పోటీగా సమావేశం పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఆయన అనుచరులు కూడా ఈ మీటింగ్‌లపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. కార్మికనగర్ సమావేశానికి వచ్చిన అజహర్‌ను వంద‌లాది మంది ఒకేసారి చుట్టుముట్టి ఘెరావ్ చేశారు.

Also Read: ఆసక్తికరంగా తాండూరు రాజకీయం.. ఆధిపత్యం కోసం ఎత్తులకు పైఎత్తులు!

ఇప్పటివరకు జూబ్లీహిల్స్ అభ్యర్థిగా విష్ణు పేరే ప్రచారంలో ఉంది. ఐతే పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా లేరన్న భావన.. అంజన్‌కుమార్‌తో విభేదాలను దృష్టిలో పెట్టుకుని అజహర్‌ను సీన్‌లోకి తీసుకురావడంతో వివాదం మొదలైంది. దీనిపై పార్టీ ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రేకు ఫిర్యాదు చేశారు విష్ణు. తాను గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన చోట.. కొత్తవారు ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారు విష్ణు. ఆయన తండ్రి పీజేఆర్‌కు ఆ నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. దీంతో తానైతే గెలుస్తానని చెబుతున్నారట విష్ణు. ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న జూబ్లీహిల్స్‌లో ఈ కొత్త వివాదాన్ని ఎలా పరిష్కరించాలో తెలియక తలలు పట్టుకుంటోంది కాంగ్రెస్ హైకమాండ్. విష్ణు అభ్యంతరంతో అజ్జూ భాయ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.