కొడుకు జైలుకు వెళ్తాడని భయపడి.. నిజాన్ని పంటిబిగువున బిగపట్టి.. బాధను గుండెల్లోనే దాచుకున్న తల్లి

తల్లి ప్రేమ అంటే ఇలా ఉంటుంది. తనకు హాని చేసిన పిల్లలను సైతం కాపాడుకుంటుంది.

కొడుకు జైలుకు వెళ్తాడని భయపడి.. నిజాన్ని పంటిబిగువున బిగపట్టి.. బాధను గుండెల్లోనే దాచుకున్న తల్లి

Updated On : February 9, 2025 / 11:42 AM IST

తల్లి ప్రేమ హద్దులు లేనిది.. పిల్లల కోసం తన ప్రాణాలనైనా త్యాగం చేస్తుంది తల్లి. పిల్లలు చేసిన తప్పులను కప్పిపుచ్చుతూ కావాలంటే ఆ తప్పులను తన మీద వేసుకునేందుకు కూడా వెనకాడదు. తనను కుమారుడు చంపడానికి ప్రయత్నించినప్పటికీ అతడి క్షేమాన్నే కోరుకుంటుంది తల్లి. ఇటువంటి ఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

రేణుక, శేఖర్‌ దంపతులు మెట్టుగూడలో నివసిస్తుంటారు. వారికి ముగ్గురు కొడుకులు (యశ్వంత్, యశ్పాల్, వినయ్‌) ఉన్నారు. భర్త మృతి చెందడంతో రేణుఖ కుమారులతో కలిసి ఉంటోంది. పెద్దకొడుకు యశ్వంత్‌ ఉద్యోగం చేయకుండా ఏడాదిగా ఖాళీగా ఉంటున్నాడు. దీంతో అతడిని రేణుక అప్పుడప్పుడు మందలిస్తుండేది.

Also Read: థ్యాంక్స్ మీట్‎లో బన్నీ ఎమోషనల్ స్పీచ్

ఫిబ్రవరి 6న మరోసారి ఆమె మందలించడంతో క్షణికావేశంలో యశ్వంత్‌ కత్తితో కడుపులో పొడుచుకుని, ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడిని అడ్డుకునే క్రమంలో తల్లి రేణుక కడుపులో రెండు కత్తి పోట్లు పడ్డాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వారిని గాంధీ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందేలా చేశారు.

కొడుకు జైలుకెళ్తాడని నిజం దాచి..
కొడుకే తనను పొడిచాడని పోలీసులకు చెబితే అతడిని జైల్లో వేస్తారని రేణుక భయపడింది. ఏం జరిగిందని ఆమెను పోలీసులు అడిగితే నలుగురు దుండగులు తమ ఇంట్లోకి ప్రవేశించి, కత్తితో పొడిచారని తెలిపింది. చివరకు పోలీసులు మళ్లీ తాజాగా ప్రశ్నించగా, తన కొడుకును రక్షించబోయి అతడి చేతిలో గాయపడ్డానని నిజాన్ని ఒప్పుకుంది. ఆ విషయాన్ని పోలీసులకు చెబితే తన కుమారుడు జైలుకి వెళ్లాల్సి వస్తుందని నిజం దాచానని చెప్పింది.