అధికారిక లాంఛనాలతో నాయిని అంత్యక్రియలు, పాడె మోసిన కేటీఆర్

Naini Narshimha Reddy funeral : తెలంగాణ మాజీ హోంమంత్రి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. గురువారం(అక్టోబర్ 22,2020) సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు పార్టీ నాయకులు హాజరయ్యారు. అంత్యక్రియల్లో భాగంగా నాయిని పాడెను మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ మోశారు. ఆ తర్వాత పలువురు ప్రజాప్రతినిధులు నాయిని పాడె మోసి నివాళులర్పించారు. నాయినిని కడసారి చూసేందుకు జనం, అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాయిని నర్సింహారెడ్డి బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవల నాయినికి కరోనా సోకడంతో.. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స అనంతరం కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ.. ఉపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకడంతో అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను మంత్రులు కేటీఆర్, హారీష్‌రావు, ఇతర ముఖ్య నాయకులు పరామర్శించారు. వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
బుధవారం నాయిని ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలియడంతో ముఖ్యమంత్రి కేసీఆర్.. అపోలో ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అయితే రాత్రి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు.