ఆమె వ్యాఖ్యలను నా నోటితో చెప్పలేను- నాంపల్లి కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన కేటీఆర్
ఆమె చేసిన వ్యాఖ్యలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. నా పరువు ప్రతిష్టలు దెబ్బతీసే విధంగా మాట్లాడారు.

Ktr On Konda Surekha (Photo Credit : Google)
Ktr Statement : మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా పిటిషన్ పై మాజీమంత్రి కేటీఆర్ నాంపల్లి కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. కొండా సురేఖ తన గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడారని కోర్టుకు తెలిపారు కేటీఆర్. తన కారణంగా వివాహాలు బ్రేక్ అవుతున్నాయని కొండా సురేఖ అన్నారని కేటీఆర్ చెప్పారు. ఇంకా తన గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తన నోటితో చెప్పలేనని అన్నారు కేటీఆర్. సురేఖ మాటలు చాలా అసహ్యంగా ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కొండా సురేఖ తనపై ఆరోపణలు చేశారని కేటీఆర్ వివరించారు. ఆమె వ్యాఖ్యలు సమాజంలో తన పరువు ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయన్నారు. చట్టప్రకారం మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు కేటీఆర్.
”అమెరికాలో ఆరేళ్లు చదువుకున్నా. చదువు పూర్తయ్యాక ఇండియా తిరిగి వచ్చా. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం జరుగుతోంది. 2006 ఆగస్టులో కేసీఆర్ కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేశారు. మళ్ళీ ఉపఎన్నికలు వచ్చాయి. 2006 నుంచి 2009 వరకు నేను తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్ సెక్రటరీగా పనిచేశాను. తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేశాను.
ఒక మంత్రిగా ఉన్న ఒక మహిళ నాపై అసత్య ఆరోపణలు చేశారు. నాపై ఇటీవల మంత్రి కొండా సురేఖ ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడారు. ఆమె చేసిన వ్యాఖ్యలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆమె చేసిన వాఖ్యలు అనేక ప్రచార మాధ్యమాల్లో ప్రచారయ్యాయి. నా పరువు ప్రతిష్టలు దెబ్బతీసే విధంగా మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ చేశానని అన్నారు.
ఆమె చెప్పినవన్నీ పూర్తిగా అవాస్తవం. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. సమాజంలో నాకున్న పేరు ప్రతిష్టలను దిగజార్చాలనే అలాంటి వ్యాఖ్యలు చేశారు. అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించాను. యూట్యూబ్ లింక్స్, పేపర్ స్టేట్ మెంట్స్ అన్నీ కోర్టుకిచ్చాను. చట్టప్రకారం మంత్రిఫై చర్యలు తీసుకోవాలి.
2009లో సిరిసిల్ల నియోజకవర్గం నుండి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాను. ఐదుసార్లు నేను ఎమ్మెల్యేగా నెగ్గాను. ప్రతి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందాను. 2014లో నేను మంత్రిగా పనిచేశాను. 2023 వరకు మంత్రి గా ఉన్నాను. 2018 లో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాను. ప్రజా జీవితంలోనే ఉన్నాను. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు, రివార్డులు వచ్చాయి.
టెక్నాలజీ మినిస్టర్ గా అనేక కంపెనీలను తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చాను. నా పరువు ప్రతిష్ట దెబ్బతీసే విధంగా మాట్లాడారు. గత 18 ఏళ్లుగా రాజకీయ జీవితంలో ఉన్న నన్ను తన మాటలతో తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖఫై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి” అని కేటీఆర్ తన స్టేట్ మెంట్ ఇచ్చారు.
Also Read : బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు.. నోటీసుతోనే జవాబిస్తానన్న సంజయ్