అందుకే మావోయిస్టులు మా అక్కను చంపారు: బంటి రాధ తమ్ముడు సంచలన వ్యాఖ్యలు

మా అక్కను 2017లో మావోయిస్టు మద్దతు దారులు ఇంటి నుంచి తీసుకుని వెళ్లారు. దళంలోకి వెళ్లిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా మా దగ్గరకి రాలేదు.

అందుకే మావోయిస్టులు మా అక్కను చంపారు: బంటి రాధ తమ్ముడు సంచలన వ్యాఖ్యలు

Neelso alias Banti Radha brother allegations on maoists

Neelso alias Banti Radha: తన అక్కను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని మావోయిస్టు బంటి రాధ సోదరుడు సూర్యం వాపోయారు. మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన బంటి రాధ మృతదేహాన్ని పోలీసులు గురువారం హైదరాబాద్ కాప్రాలోని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా సూర్యం 10 టీవీతో మాట్లాడుతూ.. దళంలోంచి బయటకు వస్తానని చెప్పినందుకే తన సోదరిని మావోయిస్టులు చంపేశారని ఆరోపించారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మావోయిస్టుల సమాచారం తన ద్వారా పోలీసులకు రాధ ఇచ్చిందనే ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.

”మా అక్కను 2017లో మావోయిస్టు మద్దతుదారులు ఇంటి నుంచి తీసుకుని వెళ్లారు. దళంలోకి వెళ్లిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా మా దగ్గరకి రాలేదు. గజ్జె కట్టడం, పాటలు పాడడం దళ సభ్యులే ఆమెకు నేర్పారు. ఆమె దళంలోకి వెళ్ళాక మేము మిస్సింగ్ కేసు కూడా పెట్టాం. మా అక్క నా ద్వారా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తుందనడంలో ఎటువంటి వాస్తవం లేదు. NIA దాడుల తరువాత రాధ గురించి మరింత ప్రచారం జరిగింది. దళంలో బాగా పనిచేయడంతో వివిధ క్యాడర్స్ లో నియమించారు.

ఇటీవల రాధ దళాన్ని వదిలి ఇంటికి వచ్చే ఆలోచన చేసింది. ఇంటికి వెళ్తానడంతో పాటు దళితురాలనే చిన్న చూపుతోనే మా అక్కను హత్య చేశారు. మా అక్కను చంపడానికి నన్ను కారణంగా చూపారు. మా అక్క నాకు మావోయిస్టు కదలికల సమాచారం ఇస్తుందనేది ముమ్మాటికీ అవాస్తవం. అసలు పోస్ట్ మార్టం సమయంలో కనీసం మాకు సమాచారం ఇవ్వలేదు. మా కుటుంబానికి న్యాయం చేసి.. మరొకరికి ఇలా జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల”ని సూర్య అన్నారు.

Also Read: హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఆ ఫామ్‌హౌసేనా? హైడ్రా అసలు లక్ష్యం ఏంటి..

కోవర్టుగా వ్యవహరిస్తుందనే…
తెలంగాణ, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ పోలీసులకు కోవర్టుగా వ్యవహరిస్తుందనే ఆరోపణలతో బంటి (పల్లెపాటి) రాధ అలియాస్ నీల్సోను మావోయిస్టులు హత్య చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం వద్ద ఆమెను హతమార్చినట్టు ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేశ్ పేరిట మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. 2017లో ఏవోబీ మావోయిస్టు పార్టీలో చేరిన రాధ సంవత్సర కాలంలోనే సెంట్రల్ ప్రొటెక్షన్ కమిటీ ఆర్మీ కమాండర్ గా ఎదిగింది. అయితే 3 నెలల క్రితం నుంచి ఆమెపై మావోయిస్టు పార్టీకి అనుమానం కలగడంతో కీలక బాధ్యతల నుంచి తప్పించి నిఘా పెట్టింది. తన తమ్ముడు సూర్యం ద్వారా పోలీసులకు సమాచారం అందిస్తుందన్న ఆరోపణలతో ఆమెకు మరణశిక్ష అమలు చేసింది. కాగా, మావోయిస్టుల చర్యతో పోలీసులు అప్రమత్తమయ్యారు.