మీకు కొత్త రేషన్‌ కార్డులు వచ్చినప్పటికీ ఈ 2 పథకాలకు దరఖాస్తులు చేసుకోలేకపోతున్నారా?

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గృహ లక్ష్మి పథకానికి అర్హులైన కొంత మంది మహాలక్ష్మి పథకానికి అర్హత సాధించలేకపోతున్నారు. దాంతో వారు వంట గ్యాస్ సిలిండర్లను పూర్తి మార్కెట్ ధరకు కొనాల్సి వస్తుంది.

మీకు కొత్త రేషన్‌ కార్డులు వచ్చినప్పటికీ ఈ 2 పథకాలకు దరఖాస్తులు చేసుకోలేకపోతున్నారా?

Updated On : July 23, 2025 / 6:39 PM IST

తెలంగాణలో పేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరైన విషయం తెలిసిందే. దీంతో వాటితో 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 రూపాయల సబ్సిడీ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి జనాలు బారులు తీరుతున్నారు. గత వారం రోజులుగా కలెక్టరేట్లు, మున్సిపల్ ఆఫీసుల వద్ద పెద్ద ఎత్తున దరఖాస్తుదారులు కనపడుతున్నారు.

సుమారు 18 నెలల కిందట ప్రజా పాలన కార్యక్రమంలో విద్యుత్, గ్యాస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఇప్పుడు దరఖాస్తు చేయడానికి వీలు అవుతోంది. వారి పాత దరఖాస్తులు ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నాయి. వాటి ఆధారంగా ఇప్పుడు పథకాలకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. అప్పట్లో దరఖాస్తు చేసుకోని వారు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది భారీ క్యూలలో నిలబడినా వారి దరఖాస్తులకు అనుమతి లభించడం లేదు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో సుమారు 58,565 కుటుంబాలు ఆరు గ్యారెంటీల పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత పొందాయి. ఈ కుటుంబాలలో సగం కంటె ఎక్కువ మంది ప్రజా పాలన సమయంలో దరఖాస్తు చేసుకోలేదు. దాంతో ఇప్పుడు ఆన్‌లైన్ నమోదుకు వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Also Read: టీ, కాఫీ, మిల్క్‌ అమ్మకాలను నిలిపేసిన కర్ణాటకలోని బేకరీలు.. యూపీఐ చెల్లింపులకూ నో.. ఎందుకంటే?

ఇప్పటికే తెల్ల రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలు కూడా ప్రస్తుతం ఉచిత విద్యుత్ స్కీమ్‌కు మాత్రమే పరిమితం అవుతున్నాయి. సబ్సిడీ ఎల్‌పీజీ ఇస్తున్నా, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో చాలా మందికి అందడం లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గృహ లక్ష్మి పథకానికి అర్హులైన కొంత మంది మహాలక్ష్మి పథకానికి అర్హత సాధించలేకపోతున్నారు. దాంతో వారు వంట గ్యాస్ సిలిండర్లను పూర్తి మార్కెట్ ధరకు కొనాల్సి వస్తుంది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు 31.18 లక్షల ఎల్‌పీజీ కనెక్షన్లు ఉన్నాయి. అయితే, 500 రూపాయల సబ్సిడీ సిలిండర్ చాలా తక్కువ మందికి మాత్రమే అందుతుంది. అధికారిక గణాంకాల ప్రకారం, 24.74 లక్షల కుటుంబాలు మహాలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకున్నాయి. అందులో 19.01 లక్షల మందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే, పౌర సరఫరాల శాఖ ప్రకారం, 3 లక్షల కనెక్షన్లకు మాత్రమే సబ్సిడీ అందుతోంది.

విద్యుత్ విషయానికొస్తే, తెలంగాణలో 52,65,129 గృహ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 24 లక్షల కుటుంబాలు ప్రజా పాలన సమయంలో ఉచిత విద్యుత్ కోసం గృహ జ్యోతి పథకం కింద దరఖాస్తు చేసుకున్నాయి. వారిలో 11 లక్షల మందికి మాత్రమే సున్నా విద్యుత్ బిల్లుకు అర్హత పొందాయి.