ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానం ఎవరిదో.. మళ్లీ ఆయనదేనా?

  • Published By: sreehari ,Published On : August 19, 2020 / 09:46 PM IST
ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానం ఎవరిదో.. మళ్లీ ఆయనదేనా?

Updated On : August 20, 2020 / 6:54 AM IST

ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలో స్థానిక సంస్థల కోటలో ఓ ఎమ్మెల్సీ స్థానం ఉంది. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి చెందిన పురాణం సతీశ్‌ ఆ పదవిలో ఉన్నారు. 2015లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఆదిలాబాదు ఎమ్మెల్సీ స్థానం నుంచి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ తూర్పు జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారాయన.



గడచిన ఐదేళ్లుగా ఆయన పార్టీతో అంటిముట్టనట్లు ఉంటున్నారనే విమర్శలున్నాయి. ఓసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలంటే జనరల్ సీటులో సరైన నియోజకవర్గం లేదు. సొంత నియోజకవర్గం చెన్నూరు ఎస్సీ రిజర్వ్‌ కావడంతో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.

ఎమ్మెల్సీగా సుమారు ఐదేళ్లు గడచిపోయింది. మరో ఏడాదిలో మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే సమయం దగ్గర పడుతుండటంతో ఆదిలాబాదు ఎమ్మెల్సీ స్థానంపై చర్చలు మొదలయ్యాయి. ఎప్పుడో ఏడాది తర్వాత జరిగే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే నాయకులు ప్రయత్నాలు మొదలుపెట్టేశారట.

వచ్చేసారి ఎమ్మెల్సీగా అవకాశం ఎవరికిస్తారని మళ్లీ పురాణం సతీశ్‌నే ఎమ్మెల్సీ వరిస్తుందా? లేక మరో వ్యక్తిని తెరపైకి తెస్తారా? అనే చర్చ మొదలైందట. సతీశ్‌ కాకుండా మరో వ్యక్తి ఎవరున్నారనే కోణంలో ఇప్పటి నుంచే సమాలోచనలు మొదలయ్యాయి. ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్న సతీశ్‌ను కాదని మరో వ్యక్తి అవకాశం ఇవ్వడానికి పశ్చిమ జిల్లాలో కొందరు నాయకులు పావులు కదుపుతుట్లు పార్టీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.



ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సతీశ్‌ పశ్చిమ ప్రాంతంలో అంటే ఆదిలాబాదు, నిర్మల్ జిల్లాలలో గెలిచిన తర్వాత పెద్దగా తిరగలేదంటున్నారు. అక్కడి ప్రజాప్రతినిధులతో పెద్దగా సంబంధాలు కూడా లేవట. ఒకవేళ వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలలో సతీశ్‌కు మళ్లీ అవకాశం కల్పిస్తే పశ్చిమ జిల్లాలైన ఆదిలాబాదు, నిర్మల్‌లలో ఉండే ప్రజాప్రతినిధుల నుంచి వ్యతిరేకత ఎదురు అవుతుందని భావిస్తున్నారు.

గడచిన ఐదేళ్ల కాలంలో పూర్తిగా తూర్పు జిల్లాలో మాత్రమే సతీశ్‌ తిరిగారని, ఉమ్మడి జిల్లాకు ఎమ్మెల్సీగా ఉన్నా.. ఆదిలాబాదు లాంటి ప్రాంతంపై చిన్నచూపు చూశారని అంటున్నారు. ఈసారి ఎమ్మెల్సీగా అధిష్టానం ఎవరిని ప్రకటించినా అందరు ప్రజాప్రతినిధులతో సంప్రదింపులు జరిపన తర్వాతే ఖరారు చేయాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.