YS Jagan: పులివెందుల పొలిటికల్ పిక్చర్‌లోకి కొత్త ముఖం..! జగన్ వ్యూహం ఏంటి? వైసీపీ నేతల్లో కలవరం ఎందుకు?

పులివెందుల జడ్పీటీసీ బైపోల్‌లో ఓటమి తర్వాత..జగన్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కానీ అవినాష్ కుటుంబాన్ని కాదని..

YS Jagan: పులివెందుల పొలిటికల్ పిక్చర్‌లోకి కొత్త ముఖం..! జగన్ వ్యూహం ఏంటి? వైసీపీ నేతల్లో కలవరం ఎందుకు?

Updated On : October 22, 2025 / 11:04 PM IST

YS Jagan: ఏపీలో కడప జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్‌గానే నడుస్తుంటాయ్. గత ఎన్నికల్లో జరిగిన ఓటమి తర్వాత సొంత జిల్లా కడప, తన ఇలాకా పులివెందుల స్పెషల్ కాన్సంట్రేషన్ పెడుతున్నారు వైసీపీ అధినేత జగన్. పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలో ఓడటంతో..జగన్‌ మరింత అలర్ట్ అయ్యారని అంటున్నారు. ఎంపీగా..కడప జిల్లా మొత్తం..పైగా పులివెందుల వ్యవహారాలు చూసుకోవడం అవినాశ్‌రెడ్డికి భారంగా మారిందట. పైగా మధ్యలో పార్లమెంట్‌ సమావేశాలు..ఢిల్లీ పర్యటనలతో అవినాశ్‌ బిజీబిజీ అయిపోతున్నారట. దీంతో అవినాశ్‌రెడ్డిపై కాస్త భారం తగ్గించేందుకు..పులివెందులలో పట్టు కోల్పోకుండా చూసుకునేందుకు..ఓ కీలక నేతను పులివెందుల పొలిటికల్ ముఖచిత్రంలోకి దించుతున్నారు జగన్.

స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతుండటంతో పులివెందుల మున్సిపాలిటీ చైర్మన్ రేసులో చవ్వా దుష్యంత్ రెడ్డి పేరు పరిశీలనలోకి రావడం పులివెందుల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వైఎస్ఆర్ ఉన్నంతకాలం వివేకానంద రెడ్డి పులివెందుల బాధ్యతలు చూసే వారు. వైఎస్ మరణానంతరం జగన్ యాక్టీవ్ పాలిటిక్స్‌లోకి వచ్చినప్పటి నుంచి అవినాష్ కుటుంబం కంట్రోల్ లోనే పులివెందుల పాలిటిక్స్‌ నడుస్తున్నాయి. కానీ ఇప్పుడు అవినాష్ రెడ్డి కుటుంబం కాకుండా చవ్వా దుష్యంత్‌రెడ్డి పేరు వినిపించడం హాట్ టాపిక్‌గా మారింది.

జగన్ దంపతులకు దగ్గరి బంధువు.. ఇంటర్నేషనల్ కాంట్రాక్టర్..

చవ్వా దుష్యంత్ రెడ్డి మాజీ సీఎం జగన్ దంపతులకు దగ్గరి బంధువు. దుష్యంత్‌రెడ్డి సొంత ఊరు కమలాపురం నియోజకవర్గ పరిధిలోని వీరపనాయునిపల్లె మండలం తాటిమాకుల పల్లె గ్రామం. దేశ విదేశాల్లో వ్యాపారాలు చేయడంతో పాటు ఇంటర్నేషనల్ కాంట్రాక్టర్‌గా ఆయనకు పేరుంది. అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన ప్రతీసారి ఏదో ఒక నియోజకవర్గ టికెట్‌ రేసులో ఉండటం.. అధిష్టానం ఆదేశాలతో అక్కడి నేతలను గెలిపించడంలో దుష్యంత్ రెడ్డి వంతు అయిపోతుంది.

వైఎస్సార్ ఉన్న సమయంలో 2009లో కమలాపురం అసెంబ్లీ టికెట్ ఆశించినప్పటికీ అప్పుడు ఆయనకు టికెట్ దక్కలేదు. 2019లో వైసీపీ తరుఫున జమ్మలమడుగు బరిలో నిలిచిన డాక్టర్ సుధీర్ రెడ్డి గెలుపులో దుష్యంత్ రెడ్డి కీలకపాత్ర పోషించారు. ఆ సమయంలో కూడా దుష్యంత్ రెడ్డికి జమ్మలమడుగు అసెంబ్లీ టికెట్ ఇస్తున్నట్లు ప్రచారం హోరెత్తింది. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో దుష్యంత్ కనిపించడం చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుతం పులివెందుల టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న బీటెక్ రవి.. పులివెందుల మున్సిపల్ ఛైర్మన్ రేస్‌లో దుష్యంత్ ఉన్నట్లు వైసీపీలో చర్చ నడుస్తోందని చెప్పడం మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది.

అవినాష్ రెడ్డి చిన్నాన్నను కాదనడంతో కలవరం..

పులివెందుల పాలిటిక్స్‌లో దుష్యంత్ రెడ్డి పేరు తెరపైకి రావడంపై రకరకాల టాక్‌లు నడుస్తున్నాయి. పులివెందుల మున్సిపాలిటీ అవినాష్ రెడ్డి చిన్నాన్న మనోహర్ రెడ్డిని కాదని దుష్యంత్ రెడ్డికి ఇవ్వడం సొంత పార్టీ నేతలను కలవరపెడుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పులివెందుల మున్సిపల్ ఛైర్మన్ అంటే పులివెందుల ఎమ్మెల్యే తరహా ఎన్నికలు చూడటం ఖాయం. మున్సిపల్ ఎన్నికలతో ఎంట్రీ ఇచ్చి..రాబోయే రోజుల్లో పులివెందుల బాధ్యతలు మొత్తం దుష్యంత్‌రెడ్డికి అప్పగిస్తారన్న చర్చ జరుగుతోంది.

అయితే దుష్యంత్‌ తెరమీదకు తెస్తున్నది ఎంపీ అవినాశ్‌రెడ్డిపై భారం తగ్గించడానికా? లేక అవినాష్ స్థానం దుష్యంత్‌కు ఇవ్వబోతున్నారా అన్న ప్రచారం ఊపందుకుంది. అవినాశ్‌పై వస్తున్న ఆరోపణలు..పులివెందుల జడ్పీటీసీ బైపోల్‌లో ఓటమి తర్వాత..జగన్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కానీ అవినాష్ కుటుంబాన్ని కాదని దుష్యంత్‌ను ముందుకు తెస్తే..పులివెందుల వైసీపీలో పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.

Also Read: ఏపీ రాజకీయాల్లో భీమవరం పేకాట పంచాయితీ.. పవన్‌ కల్యాణ్ ఆగ్రహానికి కారణమైన ఆ ఎమ్మెల్యే ఎవరు?