అంతా క్షేమం.. ఖమ్మం మున్నేరు బ్రిడ్జిపై చిక్కుకున్న తొమ్మిది మంది సురక్షితంగా బయటకు..

ఖమ్మంలోని ప్రకాశ్ నగర్ బ్రిడ్జిపై వరద నీటిలో చిక్కుకున్న తొమ్మిది మంది సురక్షితంగా బయటకు వచ్చారు.

అంతా క్షేమం.. ఖమ్మం మున్నేరు బ్రిడ్జిపై చిక్కుకున్న తొమ్మిది మంది సురక్షితంగా బయటకు..

Khammam Flood

Khammam Flood : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఖమ్మం జిల్లాలో భారీ వర్షం కురుస్తుండటంతోపాటు.. మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రకాశ్ నగర్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహించింది. అంతకుముందు ప్రకాశ్ నగర్ బ్రిడ్జిపైకి వెళ్లిన తొమ్మిది మంది ఆదివారం సాయంత్రం బ్రిడ్జిపై చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాల సాయంతో వారిని బయటకు రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, అప్పటికే స్థానికులు ఏర్పాటు చేసిన జేసీబీల సాయంతో మరోవైపు నుంచి బ్రిడ్జిపై చిక్కుకున్న తొమ్మిది మంది సురక్షితంగా బయటకు వచ్చారు. తొమ్మిది గంటల ఉత్కంఠకు తెరపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Also Read : విజయవాడ ముంపు ప్రాంతాల్లో బోటుపై సీఎం చంద్రబాబు పర్యటన.. ఆదుకుంటామని బాధితులకు హామీ

ఆదివారం సాయంత్రం ప్రకాశ్ నగర్ బ్రిడ్జిపై తొమ్మిది మంది చిక్కుక్కున్న విషయాన్ని తెలుసుకున్న అధికారులు వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేరుగా రంగంలోకిదిగి వారిని కాపాడే చర్యలను పర్యవేక్షించారు. నేవీ హెలికాప్టర్ ను రప్పించేలా ప్రయత్నాలు చేశారు. నేవీ హెలికాప్టర్ విజయవాడ వచ్చే సమయానికే చీకటి పడటంతో తాము రాలేమని నేవీ సిబ్బంది తెలియజేశారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సమాచారం ఇచ్చారు. వారు రాత్రి పొద్దుపోయాక వచ్చి బ్రిడ్జిపై చిక్కుకున్న వారిని కాపాడేందుకు బ్రిడ్జిపై వెళ్లగా.. అప్పటికే మరోవైపు నుంచి స్థానికులు ఏర్పాటు చేసిన జేసీబీల సాయంతో బ్రిడ్జిపై చిక్కుకున్న తొమ్మిది మంది సురక్షితంగా బయటకు వెళ్లినట్లు గుర్తించారు. బ్రిడ్జిపై చిక్కుకున్నవారు సురక్షితంగా బయటకు వచ్చారని ముందుగానే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం ఇవ్వకపోవటంతో మంత్రి తుమ్మల కలెక్టర్, సీపీపై సీరియస్ అయ్యారు. అయితే, బ్రిడ్జిపై చిక్కుకున్న తొమ్మిది మంది సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడటంతో అందరూ ఊపీరిపీల్చుకున్నారు.

Also Read : టెన్షన్, టెన్షన్.. మున్నేరు దగ్గర ఇంకా జలదిగ్బంధంలోనే ఆ 9 మంది..

దాదాపు తొమ్మిది గంటలపాటు ప్రకాశ్ నగర్ మున్నేరు బ్రిడ్జిపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బాధితులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అంతకుముందు డ్రోన్లు సాయంతో బాధిత కుటుంబ సభ్యులు వారికి భోజనాలు అందజేశారు. అధికారులు కనీస చర్యలు చేపట్టలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే, స్వయాన మంత్రి తుమ్మల రంగంలోకిదిగి వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. చివరికి వారు సురక్షితంగా బయటకు రావటంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు.